పూర్తిస్థాయి లాక్డౌన్ వైపు ప్రధాని మోడీ అడుగులు???
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. పైగా, సమూహ వ్యాప్తి వైపు పయనిస్తున్నట్టుగా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు రంగంలోకి దిగారు. దేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు ప్రారంభమైన తర్వాత ఇప్పటికే పలుమార్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇపుడు మరోమారు లాక్డౌన్ అంశంపై మాట్లాడేందుకు ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇందులోభాగంగా ఈ నెల 16, 17 తేదీల్లో ముఖ్యమంత్రులతో మాట్లాడేందుకు షెడ్యూల్ రూపొందించారు. 16వ తేదీ మంగళవారం పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు.
ఇక, తెలుగు రాష్ట్రాల సీఎంతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ 17వ తేదీ 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
కాగా, ఇప్పటివరకు దేశంలో 2.98 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,498 మంది మరణించారు. 1.47 లక్షల మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రం ఈ కేసుల నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు.