బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (08:42 IST)

లాక్డౌన్ 6.Oపై కసరత్తు: నేటి నుంచి సీఎంలతో ప్రధాని సమీక్ష!

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు దేశం చిన్నాభిన్నమైపోతోంది. ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది. కరోనా లాక్డౌన్ కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అలాగే, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో మరోమారు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా, మంగళవారం కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. 
 
అలాగే, బుధవారం మరికొంతమంది సీఎంలతో మాట్లాడుతారు. ఆ తర్వాత మరోసారి దేశవ్యాప్త లాక్డౌన్‌ను విధిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. అదేసమయంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా, కరోనాను నివారించాల్సిన చర్యల గురించి రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసమే మోడీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఇప్పటికే పీఎంఓ వర్గాలు వెల్లడించాయి.
 
అలాగే, రెండు రోజుల పాటు సీఎంలతో నిర్వహించే సమావేశం తర్వాత మోడీ మళ్లీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే, ఈ విషయంలో ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడకున్నా, మోడీ మాట్లాడటం లేదా మీడియా ద్వారా ప్రకటన విడుదల చేయడం జరుగుతుందని తెలుస్తోంది. 
 
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వీలుగా మరోమారు లాక్డౌన్ తప్పదని దేశ ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు. పలు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో బెడ్లు నిండుకోవడంతో, కేసుల సంఖ్యను తగ్గించాలంటే, లాక్డౌన్ ఒక్కటే ఏకైక మార్గమని, మరోమారు ప్రజా రవాణాలను, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనులను నిలిపివేస్తే, ప్రజలు ఇంటికే పరిమితమవుతారని, తత్ఫలితంగా కేసుల సంఖ్య తగ్గుతుందన్నది మెజార్టీ ప్రజల భావనగా ఉంది.