శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జూన్ 2020 (19:16 IST)

భారత్ కంటే మాకే నష్టం.. ఒప్పుకున్న చైనా.. రాళ్లతో దాడి చేశారు..

India_China
భారత్-చైనా సరిహద్దుల వద్ద జరుగుతున్న ఘర్షణల కారణంగా చైనా నష్టపోయినట్లు ఒప్పుకుంది. భారత్‌తో సరిహద్దుల వద్ద జరిగిన ఘర్షణలో తమ జవాన్లు మరణించారని చైనా ప్రకటించింది. మృతుల సంఖ్యను మాత్రం అధికారికంగా వెల్లడించేందుకు చైనా ప్రతినిధి నిరాకరించారు.

ఇండియాకన్నా తమకే అధికంగా నష్టం వాటిల్లిందని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారని చైనా అధికార మీడియా 'క్సిన్హువా' వెల్లడించింది. భారత జవాన్లే తొలుత దాడికి దిగారని చెబుతూ, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించామని పేర్కొంది.
 
ఇకపోతే.. ఈ సరిహద్దు దాడిలో 20 మంది భారత జవాన్లు మరణించగా, 30 మందికి పైగా చైనా జవాన్లు మృతి చెందివుండవచ్చునని సమాచారం. సరిహద్దుల్లో వివాదం తరువాత, ఆ ప్రాంతానికి భారీ ఎత్తున చైనా బలగాలను తరలిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు ఇండియా కూడా మరిన్ని ఆయుధాలను అదే ప్రాంతానికి ఇప్పటికే తరలించడంతో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని రెజిమెంట్లలో ఉన్న సైన్యాన్ని, లడఖ్ ప్రాంతానికి పంపుతోంది. 
 
మరోవైపు లడఖ్ వద్ద గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో పెద్ద సంఖ్యలో చైనా సైనికులు చనిపోయినట్టు ఆలస్యంగా వెల్లడైంది. దీనిపై అమెరికా మీడియాలో ఆసక్తికర కథనాలు వచ్చాయి.

అమెరికా నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఘర్షణల్లో 35 మంది చైనా సైనికులు చనిపోయారని, తమ సైనికులు చనిపోవడాన్ని చైనా అవమానంగా భావిస్తోందని యూఎస్‌కు చెందిన ఓ సంస్థ పేర్కొంది.
 
ఇకపోతే.. లడఖ్‌లోని సరిహద్దుల వద్ద భారత్‌, చైనా మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భారత జవాన్లపై రాళ్లు విసిరి, రాడ్లతో చైనా సైనికులు దాడికి దిగిన ఘటనలో మరికొంత మంది భారత జవాన్లు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.