ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల రెండు దేశాల సేనలు హిమాలయ పర్వతాల్లో ఢీ అంటే ఢీ అంటున్నాయి. తమ వ్యూహాత్మక లక్ష్యాలే పరమావధిగా రెండు దేశాలూ ముందుకెళ్తున్న తరుణంలో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముంది.
కశ్మీర్‌లోని లద్దాఖ్‌లో వివాదాస్పద ప్రాంతమైన గాల్వాన్ లోయలోకి వేల మంది చైనా సైనికులు అక్రమంగా ప్రవేశించారని అధికారులు చెబుతున్నట్లు భారత్ మీడియా వెల్లడిస్తోంది. ఈ పరిణామాలు భారత్ నాయకులతోపాటు సైనిక నిపుణులనూ నిర్ఘాంతపోయేలా చేస్తున్నాయి.
భారత్ తమ భూభాగంగా భావిస్తున్న ప్రాంతంలో మే మొదటి వారంలో చైనా బలగాలు టెంట్లు వేశాయని, గొయ్యిలు తవ్వాయని, కొన్ని కిలోమీటర్ల వరకూ భారీ సామగ్రిని తరలించాయని వార్తలు వచ్చాయి. 2008లో మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చిన ఇక్కడున్న ఓ వైమానిక స్థావరాన్ని అనుసంధానిస్తూ భారత్ వందల కి.మీ. పొడవైన ఓ రోడ్డును నిర్మిస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇది సాధారణ చొరబాటుకాదని ఈ చర్య ద్వారా చైనా స్పష్టమైన సందేశం ఇస్తున్నట్లు భారత్‌లోని నిపుణులు భావిస్తున్నారు. "ఇది చాలా తీవ్రమైన పరిణామం. భారత్‌లో భాగమేనని ఇదివరకు అంగీకరించిన ప్రాంతంలోకి చైనా సేనలు అడుగు పెడుతున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితులను ఈ చర్యలు పూర్తిగా తారుమారు చేస్తున్నాయి" అని భారత సైనిక వ్యవహారాల నిపుణులు, సైన్యంలో కల్నల్‌గా పనిచేసిన అజయ్ శుక్లా వ్యాఖ్యానించారు.
అయితే చైనా ఈ విషయంలో భిన్నంగా స్పందిస్తోంది. భారత్ వల్లే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మారుతున్నాయని చెబుతోంది. లద్దాఖ్‌లో ఇప్పటికే రెండు సార్లు రెండు సైన్యాలు ఘర్షణకు దిగాయని భారత్ మీడియా చెబుతోంది. గాల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, ప్యాంగాంగ్ లేక్‌లలో సైన్యాలు ఢీ అంటే ఢీ అని ఎదురుపడినట్లు వివరిస్తోంది.
భారత్, చైనాల మధ్య 3,400 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది. దీని వెంబడి చాలా ప్రాంతాలపై సరిహద్దు వివాదాలున్నాయి. సరిహద్దుల వెంబడి రెండు దేశాలు నిర్వహించే గస్తీలు అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతుంటాయి. అయితే నాలుగు దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక్క తూటా కూడా పేల్చలేదని రెండు దేశాలు నొక్కి చెబుతున్నాయి.
ప్రపంచంలో అతి పెద్ద సైన్యాలూ చాలాసార్లు ఢీ అంటే ఢీ అంటూ ఎదురుపడ్డాయి. రెండు దేశాల మధ్య ఉండే వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) హద్దులు చాలాచోట్ల అస్పష్టంగా ఉంటాయి. నదులు, సరస్సులు, మంచుతో కప్పి ఉండే ప్రాంతాలతో సరిహద్దులు మారుతుంటూ అప్పుడప్పుడు ఘర్షణలకు కారణం అవుతుంటాయి.
ప్రస్తుతం రెండు దేశాల మధ్య కనిపిస్తున్న ఉద్రిక్త పరిస్థితులు కేవలం లద్దాఖ్‌కు మాత్రమే పరిమితం కావు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం సిక్కింతో చైనా సరిహద్దు ప్రాంతమైన నాకు లా పాస్‌లోనూ రెండు దేశాల సైనికుల మధ్య ఈ నెల మొదట్లో ఘర్షణ వాతావరణం కనిపించింది. నేపాల్ కొత్తగా విడుదలచేసిన ఓ మ్యాప్ కూడా సరిహద్దుల్లో వివాదానికి కారణమైంది. తమ భూభాగంలో అక్రమంగా రోడ్డు నిర్మిస్తున్నారని భారత్‌పై నేపాల్ ఆరోపణలు చేస్తోంది.
తాజా వివాదం ఏమిటి?
ప్రస్తుత వివాదానికి చాలా కారణాలున్నాయి. అయితే వీటి మూలాల్లో మాత్రం వ్యూహాత్మక లక్ష్యాలే కనిపిస్తున్నాయి. మరోవైపు రెండు దేశాలూ ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. "ప్రశాంతంగా ఉండే గాల్వాన్ నది నేడు హాట్‌స్పాట్‌గా మారింది. ఎందుకంటే ఎల్ఏసీకి సమీపంలో శ్యోక్ నది వెంబడి దౌలత్ బెగ్ ఒల్డీ (డీబీవో) వరకు భారత్ రోడ్డు మార్గం నిర్మిస్తోంది. లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి అత్యంత మారుమూల, దాడికి అనువైన ప్రాంతమే ఈ డీబీవో" అని శుక్లా వివరించారు.
ఇక్కడి మౌలిక సదుపాయాలను పటిష్ఠం చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం చైనాకు ఆగ్రహం తెప్పించినట్లు కనిపిస్తోంది. "గాల్వాన్ లోయ ప్రాంతం చైనా భూభాగం. అక్కడి సరిహద్దు చాలా స్పష్టంగా ఉన్నాయి" అని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ నొక్కి చెప్పింది. "గాల్వాన్ లోయలోకి భారత్ సైన్యమే అక్రమంగా ప్రవేశించినట్లు చైనా సైన్యం చెబుతోంది. ఎల్ఏసీ వెంబడి పరిస్థితులను భారత్ తారుమారు చేయడంతో చైనాకు ఆగ్రహం వచ్చింది" అని మేధోమథన సంస్థ చెంగ్‌డూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (సీఐడబ్ల్యూఏ) అధ్యక్షుడు డాక్టర్ లాంగ్ షింగ్‌చున్ వ్యాఖ్యానించారు.
"ఇలాంటి పరిస్థితులు ఎప్పటికప్పుడే వస్తుంటాయి. భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించడం ద్వారా చైనా బలాన్ని ప్రదర్శిస్తోంది" అని మరో మేధోమథన సంస్థ విల్సన్ సెంటర్‌లోని ఆసియా ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్ మైకెల్ కుగెల్‌మ్యాన్ వ్యాఖ్యానించారు. ఏవైనా ఘర్షణలు చోటుచేసుకుంటే వేగంగా సైన్యాన్ని, సైనిక సామగ్రిని సరిహద్దులకు తరలించేందుకు తాజా రోడ్డు మార్గం భారత్‌కు తోడ్పడుతుంది.
రెండు దేశాల మధ్య ఏడాది నుంచి విధానపరమైన అంశాల మీదా విభేదాలు తలెత్తుతున్నాయి. గత ఏడాది ఆగస్టులో కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి భారత్ వివాదాస్పదంగా ముగింపు పలికింది. ప్రస్తుతం అక్సాయ్ చిన్‌తోపాటు లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అక్సాయ్ చిన్.. చైనా నియంత్రణలో ఉంది. దీన్ని భారత్ తమ భూభాగంగా చెబుతోంది.
పాకిస్తాన్ ఆధీనంలోనున్న కశ్మీర్ భూభాగాన్ని తిరిగి తీసుకోవాలంటూ భారత్‌లోని హిందూ జాతీయవాద బీజేపీ ప్రభుత్వంలోని సీనియర్ నాయకులు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఈ ప్రాంతం మీదుగా వ్యూహాత్మక కారాకోరం హైవే వెళ్తోంది. ఇది చైనా, పాక్‌లను అనుసంధానం చేయడంలో కీలకంగా పనిచేస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుల్లో భాగంగా ఇక్కడ చైనా-పాకిస్తాన్ ఆర్థిక నడవా (సిపెక్)ను చైనా నిర్మిస్తోంది. దీని కోసం దాదాపు 60 బిలియన్ డాలర్లను చైనా పెట్టుబడులు పెట్టింది. పాక్‌లోని గ్వాదర్ ఓడ రేవుకు సరకులను తరలించడంలో ఇది కీలకంగా మారనుంది. అరేబియా సముద్రంపై పట్టు సాధించేందుకు చైనాకు ఈ నౌకాశ్రయం చాలా అవసరం.
మరోవైపు కరోనావైరస్ వ్యాప్తి మొదలైన సమయంలో తమ దేశంలో వైద్య పరికరాలు, వైద్యులకు భద్రత కల్పించే సామగ్రి నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఎగుమతులపై భారత్ విధించిన నిషేధంపైనా చైనా అసంతృప్తితో ఉంది.
ఇది ఎంత ప్రమాదకరం?
"రెండు దేశాల సైన్యాలూ ఎల్ఏసీని దాటడం సాధారణమే. ఇలాంటి వివాదాలను స్థానిక సైన్యాధికారులు పరిష్కరించేస్తుంటారు. అయితే ఈ స్థాయిలో వివాదం ముందెన్నడూ చూడని స్తాయికి పెరిగింది." అని మాజీ భారత దౌత్యవేత్త, భారత్-చైనా, లద్దాఖ్ వ్యవహారాల నిపుణుడు పీ స్తోబ్దన్ వివరించారు.
"భారత్‌కు కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ప్యాంగాంగ్ లేక్‌ను చైనా తీసుకుంటే లద్దాఖ్‌ను కాపాడుకోవడం కష్టం. వ్యూహాత్మకమైన శ్యోక్ లోయలోకి చైనా సైన్యాన్ని అనుమతిస్తే.. వారు నుబ్రా లోయతోపాటు సియాచిన్‌లోకి వచ్చేస్తారు."
నిఘా వైఫల్యం వల్ల భారత్ సేనలను చైనా చుట్టు ముట్టినట్టు కనిపిస్తోంది. సరిహద్దుల్లోని సైనిక విన్యాసాలు జరుగుతున్న ప్రాంతం నుంచి చైనా వేగంగా భారీ యంత్రాలను, పెద్ద యెత్తున సైనికులను వివాదాస్పద ప్రాంతాలకు తరలించినప్పుడు అక్కడ భారత సైనికుల సంఖ్య చాలా తక్కువగా ఉందని భారత్ మీడియాలో వార్తలు వచ్చాయి.
దీంతో భారత్ అప్రమత్తమైంది. చర్చల ద్వారా బలగాలను వెనక్కి తీసుకొనేలా చైనాను ఒప్పించాలి లేదా బల ప్రయోగంతో చైనా సేనలను వెనక్కి పంపించాలి. ఈ రెండింటిలో ఏదీ తేలిక కాదు. చైనా.. ప్రపంచంలో రెండో అతి పెద్ద సైనిక శక్తి. సాంకేతిక పరిజ్ఞానంలో ఇది భారత్ కంటే ముందుంది. మరోవైపు చైనా దగ్గర అధునాతన మౌలిక సదుపాయాలున్నాయి. సైనిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు అవసరమైన నిధులనూ చైనా మళ్లించుకోగలదు. మరోవైపు భారత్ ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని కరోనావైరస్ మరింత దిగజార్చింది అని శుక్లా వ్యాఖ్యానించారు.
తర్వాత ఏమిటి?
చరిత్రలో భారత్ చాలా పాఠాలు నేర్చుకుంది. 1962 సరిహద్దు వివాదం సమయంలో చైనా చేతిలో భారత్ పరాభవానికి గురైంది. 38,000 కి.మీ. పరిధిలోని తమ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని భారత్ చెబుతోంది. దీనిపై మూడు దశాబ్దాలుగా చాలాసార్లు చర్చలు జరిగినా ఎలాంటి పురోగతీ కనిపించలేదు.
భారత్ తమదిగా చెబుతున్న, లద్దాఖ్‌లోని తూర్పు ప్రాంతమైన అక్సాయ్ చిన్ ఇప్పుడు చైనా నియంత్రణలోనే ఉంది. పశ్చిమ టిబెట్‌ను షిన్‌జియాంగ్‌తో అనుసంధానించడంలో చైనాకు ఈ ప్రాంతం కీలకంగా మారుతోంది. 2017లోనూ చైనా, భారత్, భూటాన్ కూడలైన డోక్లాంలో రెండు నెలలకుపైగా చైనా, భారత్ ఢీ అంటే ఢీ అని ఎదురెదురు పడ్డాయి.
భూటాన్ తమదిగా చెబుతున్న ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మించడాన్ని భారత్ తప్పుపట్టింది. అయితే చైనా వెనక్కి తగ్గలేదు. ఆరు నెలల్లోనే అక్కడ ఓ శాశ్వత సైనిక స్థావరాన్ని చైనా నిర్మించినట్లు భారత్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా చర్చలే మార్గంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సైనిక చర్యలకు దిగితే రెండు దేశాలూ చాలా నష్టపోతాయి.
"ఉద్రిక్తతలు పెంచుకోవాలని చైనా కోరుకోవట్లేదు. భారత్ కూడా అదే అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే పరిస్థితి రెండు దేశాలపైనా ఆధారపడి ఉంది. జాతీయవాద మీడియా చేస్తున్న వ్యాఖ్యలను భారత్ ప్రభుత్వం పట్టించుకోకూడదు." అని చెంగ్‌డూలోని సీఐడబ్ల్యూఏకు చెందిన డాక్టర్ లాంగ్ వ్యాఖ్యానించారు. "రెండు దేశాలకూ ఉన్నత స్థాయి చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకునే సామర్థ్యముంది."
సరిహద్దు వివాదానికి చైనా మీడియా అంత ప్రాధాన్యం ఇవ్వట్లేదు. సాధారణ చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని అక్కడ వార్తలు వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టుకోవడంతోపాటు సైనిక చర్యల జోలికి పోకూడదని రెండు దేశాలు భావిస్తున్నట్లు కనిపిస్తోందని కంట్రోల్ రిస్క్స్ కన్సల్టెన్సీలోని దక్షిణాసియా విభాగం అసోసియేట్ డైరెక్టర్ ప్రత్యూషా రావ్ వ్యాఖ్యానించారు. "సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో రెండు దేశాలకూ మంచి రికార్డు ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి"