శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (14:38 IST)

చేతులెత్తేసిన సుప్రీంకోర్టు... ఆ కోర్టులోనే తేల్చుకోవాలంటూ చిదంబరంకు షాక్

కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ అరెస్టులో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. అదేసమయంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. పైగా, కింది కోర్టులోనే తేల్చుకోవాలని సూచన చేసింది. 
 
ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. చిదంబరం ఇప్పటికే అరెస్టు అయినందున ముందస్తు బెయిల్ పిటిషన్ చెల్లదని పేర్కొంది. అయితే, ఆయన అరెస్టు కావడానికి ముందే పిటిషన్ దాఖలు చేశామని చిదంబరం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 
 
అరెస్టు తర్వాత దాఖలు చేసిన పిటిషన్ ఇంకా లిస్టు కాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తర్వాత విచారణ చేపడుతామని కోర్టు స్పష్టం చేసింది. చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నారు. 
 
మరోవైపు, ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు 26వ తేదీ సోమవారం వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ గడువు కూడా సోమవారంతో ముగియనుంది.