సీనియర్ పాత్రికేయుడు కుల్దీప్ నయ్యర్ కన్నుమూత
ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు కుల్దీప్ నయ్యర్ కన్నుమూశారు. ఆయన వయసు 95 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. కాలమిస్టుగా, మానవహక్కుల ఉద్యమకారుడిగా, రాజ
ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు కుల్దీప్ నయ్యర్ కన్నుమూశారు. ఆయన వయసు 95 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. కాలమిస్టుగా, మానవహక్కుల ఉద్యమకారుడిగా, రాజ్యసభ సభ్యుడిగా బహుముఖ పాత్ర పోషించారు.
ఈయన 1923 ఆగస్టు 14వ తేదీన అవిభక్త భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న సియాల్ కోటలో జన్మించారు. 1975-77లలో భారత ఎమర్జన్సీ కాలంలో అరెస్టు అయ్యారు. 1996లో ఐక్యరాజ్యసమితికి వెళ్ళిన భారతీయ సభ్యులలో ఒకరు. 1990లో గ్రేట్ బ్రిటన్ హై కమిషనరుగా బాధ్యతలు నిర్వహించారు. 1997 ఆగస్టులో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
ముఖ్యంగా, స్వదేశంలో ఆయన పలు పత్రికల్లో పని చేశారు. 'ఆప్-ఎడ్' (ఆపోజిట్ టు ద ఎడిటోరియల్) రచనలు, అనేక కాలమ్స్ రాశారు. వాటిలో 'ద డైలీ స్టార్', 'ద సండే గార్డియన్', 'ద న్యూస్ పాకిస్థాన్', 'ద స్టేట్స్‌మన్ (ఇండియా)', 'ఎక్స్‌ప్రెస్ ట్రిబూన్(పాకిస్థాన్)', 'డాన్ (పాకిస్థాన్)' ముఖ్యమైనవి. తెలుగులో కూడా ప్రముఖ దినపత్రికకు ఆయన కాలమ్స్ రాస్తూ వచ్చారు. కాగా, కుల్దీప్ నయ్యర్ మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు, సీనియర్ పాత్రికేయలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.