గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2020
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (15:00 IST)

ప్రైవేటీకరణ దిశగా ఎల్.ఐ.సి. - వాటా విక్రయిస్తామన్న విత్తమంత్రి

కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2020-21 వార్షిక బడ్జెట్‍లో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. దేశంలో అతపెద్ద ప్రభుత్వ జీవిత బీమా సంస్థగా ఉన్న భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్.ఐ.సీని ప్రైవేటీకరణ చేయనున్నట్టు ప్రకటించారు. అంటే... ఎల్.ఐ.సి.లోని కొంతవాటాని విక్రయించనున్నట్టు ప్రకటించారు. 
 
దీనికి సంబంధించి త్వరలో స్టాక్‌మార్కెట్‌లో ఎల్‌ఐసీ లిస్టింగ్‌ చేయనున్నట్టు తెలిపారు. అలాగే, ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది. ఫలితంగా తొలిసారిగా ఎల్‌ఐసీ నుంచి ఐపీవోను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఐపీవోల ద్వారా ఎల్‌ఐసీలో కొంతభాగం విక్రయిస్తామని ప్రకటించారు. 
 
అంతేకాకుండా, ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.3.5 లక్షల కోట్ల మూలధన సాయం అందించనున్నట్టు తెలిపారు. డిపాజిటర్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిపాజిటర్ల బీమా కవరేజ్‌ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ ఆమె నిర్ణయం తీసుకున్నారు. కంపెనీల చట్టంలో త్వరలో మార్పులు చేస్తామని ప్రకటించారు. 
 
ఇకపోతే, ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ప్రవాహం పారించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌ ప్రాంత అభివృద్ధికి రూ.5,958 కోట్లు, జమ్మూకాశ్మీర్‌కు రూ.30,757 చొప్పున కేటాయించినట్టు తెలిపారు. బ్యాంకింగేతర హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు అదనపు నిధుల కేటాయింపునకు కొత్త పథకం ప్రవేశపెడుతామని తెలిపారు.