బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 6 ఏప్రియల్ 2020 (20:37 IST)

కరోనా వైరస్‌: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..

కరోనా వైరస్ గురించి హెచ్చరించిన చైనీస్ డాక్టర్ లి వెనలియాంగ్ వుహాన్‌లో కరోనా బారిన పడిన రోగులకు వైద్యం అందిస్తూ ఇన్ఫెక్షన్‌కి గురై మరణించారు. అతని భార్య గర్భవతి. ఆమెకి జూన్ 2020లో ప్రసవం కానున్నది. కర్ణాటకలోని కరోనా వైరస్ రోగికి వైద్యం అందించిన డాక్టర్‌కి కూడా వైరస్ సోకినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి ట్వీట్ చేశారు.

 
కరోనా వైరస్ సోకిన వారికి వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, వైరస్ వ్యాప్తి సమయంలో వివిధ విభాగాలలో పని చేస్తున్న పోలీసు, ఇతర విభాగాల సిబ్బందికి, వారి కుటుంబాలకి వైరస్ సోకుతుందేమోననే భయం సాధారణ ప్రజల కంటే కాస్త ఎక్కువగా ఉండటం సహజం.

 
రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, వైద్యం అందిస్తున్న డాక్టర్లకి కూడా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అవుతుండటంతో , వైద్యుల కుటుంబాలు మరింత ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంది. ప్రతి రోజు హాస్పిటల్‌కి వెళ్లి రోగులకు వైద్యం అందిస్తున్న ఒక డాక్టర్ భార్య మనోగతం ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఈ భయం ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. కోల్‌కతాలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆర్థోపెడిషియన్‌గా పని చేస్తున్న ఒక డాక్టర్ భార్యతో బీబీసీ న్యూస్ తెలుగు మాట్లాడింది.

 
ప్రస్తుతం కోల్‌కతాలో నివాసం ఉంటున్న గాయత్రి వినయ్ తన అనుభవాలని, భయాలని, డాక్టర్ భార్యగా, ఒక తల్లిగా తాను తీసుకుంటున్న జాగ్రత్తలని వివరించారు.

 
వైరస్ బారిన పడే ముప్పు డాక్టర్ కుటుంబాలకి ఎక్కువ ఉంటుందా?
“అవును ఒక డాక్టర్ కుటుంబానికి ఎక్కువ ముప్పు ఉంటుంది. ఒక సాధారణ కుటుంబం కంటే డాక్టర్ కుటుంబంలో వాళ్లకి వైరస్ సోకడం సులభం అని అందరూ అనుకుంటారు. కానీ, ఒక సాధారణ వ్యక్తి మాల్ కి కానీ, నిత్యావసర వస్తువుల దుకాణానికి కానీ వెళ్ళినప్పుడు కలిగే ముప్పు కంటే ఒక డాక్టర్ కుటుంబానికి కలిగే ముప్పు తక్కువ ఉంటుంది. మాకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం వలన జాగ్రత్తగా ఉంటాం, కానీ, ఇది సాధారణంగా అందరికి అర్ధం కాకపోవడం వలన డాక్టర్లకి ముప్పు ఎక్కువ అనుకుంటూ ఉంటారు”.

 
కరోనా వైరస్ బారిన పడిన రోగులకు వైద్యం అందిస్తున్న ముగ్గురు ప్రభుత్వ వైద్యులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక పేర్కొంది.

 
“ఈ సంవత్సరం జనవరిలో మేము హైదరాబాద్ వెళుతుండగా మొదటి సారి ఇండియాలో కరోనావైరస్ గురించి విన్నాను. అంత కంటే ముందు నేను చైనాలో కరోనావైరస్ ప్రబలడం గురించి విన్నాను. ఎయిర్‌పోర్టులో వైరస్ కోసం స్క్రీనింగ్ చేస్తున్నట్లు తెలిసింది. మేము ఎదో ఒక వైరస్ గురించి వింటూనే ఉంటాం కాబట్టి నేను ఇదో స్వైన్ ఫ్లూ, ఓ ఎబోలా లాంటి వైరస్ అయి ఉంటుందని అనుకున్నాను. మొదటి సారి నేను కరోనావైరస్ అనే పదం విన్నప్పుడు దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు.

 
నెమ్మదిగా భారతదేశంలో కూడా తోలి కేసు నమోదు అవ్వడంతో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాను. నేను ప్రతి రోజు ఇంట్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నా భర్త ప్రతి రోజు క్షయ గాని, మరేదైనా ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్న రోగులని చూస్తూనే ఉంటారు. అందువలన అదనపు జాగ్రత్తలు తీసుకోవడమనేది మేము ప్రతి రోజు చేసే పనే.

 
భారతదేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఎండెమిక్ కి పాండెమిక్ కి ఉన్న వ్యత్యాసం తెలుసుకోవడం మొదలు పెట్టాను. దీని పట్ల నేను చాలా తటస్థంగా ఉన్నాను. పెద్దగా భయపడలేదు. అలా అని అదే పోతుందిలే అని తేలికగా కూడా తీసుకోలేదు. ప్రతి డాక్టర్ భార్యకి ఈ వైరస్ గురించి అర్ధం కావాలని లేదు. నేను మైక్రోబయాలజిస్ట్ కావడం వలన కొంచెం ఎక్కువ అర్ధం చేసుకున్నాను.

 
అలాగే, డాక్టర్లు కూడా రోగులని చూసినప్పుడు తగిన రక్షణ పరికరాలు ధరించి పరీక్షలు చేస్తారు. హాస్పిటల్ పని గంటలు అయిపోగానే శానిటైజర్ వాడి శుభ్రపర్చుకుని వస్తారు. కానీ, ఒక్కొక్క రోజు ఎక్కువగా అలిసిపోయినప్పుడు వాళ్ళు కూడా శానిటైజ్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు.

 
నా స్నేహితురాలు భర్త కూడా డాక్టర్ గా పని చేస్తున్నారు. తనకి ఇద్దరు చిన్న పిల్లలు. దాంతో తను మరింత భయపడుతోంది. ఐతే, తనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ధైర్యంగా ఉండమంటాను. డాక్టర్ల భార్యలందరూ ధైర్యంగా ఉంటారన్న నియమం ఏమి లేదు.

 
ప్రస్తుతానికి అయితే నా భర్త పని చేస్తున్న హాస్పిటల్లో ఎవరూ కోవిడ్-19కి గురైన రోగులు నమోదు కాలేదు కానీ, వైరస్ సోకిన వారు కూడా వైద్యం తీసుకోవడానికి వచ్చే అవకాశం ఉంది. అయితే, హాస్పిటల్లో ఇప్పుడు కేవలం అత్యవసర కేసులు మాత్రమే చూస్తున్నారు. తను పూర్తిగా వ్యక్తిగత రక్షణ సూట్ ధరించి రోగులను చూస్తున్నారు. ఇంటికి రాగానే తనకి కేటాయించిన ప్రత్యేక టాయిలెట్లో స్నానం చేసి, తన వస్తువులన్నీ శానిటైజ్ చేసిన తర్వాతే ఇంకొక పనేదైనా చేస్తాం.

 
ఒక వంద రూపాయిల నోటు మీద ఎన్ని క్రిములు ఉంటాయా అని ఎప్పుడైనా ఆలోచించామా? ముఖ్యంగా రోడ్డు మీద తింటున్నప్పుడు వంట చేస్తున్న చేతితోనే, డబ్బులు కూడా తీసి ఇస్తారు. అయితే, ఇలాంటి వైరస్ ని తట్టుకోవడానికి మన శరీరం అలవాటు పడిపోయింది. కానీ, కరెన్సీ నోట్ల మీద కూడా కనిపించని వైరస్ ఉంటుంది.

 
శుభ్రపర్చుకోవడం వేరు, శానిటైజేషన్ వేరు
"అందరూ ఇంటిని శుభ్రపరుచుకుంటారు. కానీ మేము శానిటైజ్ చేసుకుంటాం. మామూలుగా శుభ్రపర్చుకోవడానికి సబ్బు, లేదా సోప్ లిక్విడ్, నీరు ఉంటే చాలు. కానీ, శానిటైజేషన్ కి క్రిములని సంహరించే ప్రత్యేకమైన లిక్విడ్లు ఉండాలి. మా కార్, కార్ స్టీరింగ్, మొబైల్ ఫోన్ల నుంచి, పెన్, డబ్బులు పెట్టే పర్సు వరకు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని రోజుకు రెండు మూడు సార్లు శానిటైజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నా దగ్గర ఉండే శానిటైజర్ అయిపోతూ వస్తోంది. ఇప్పుడు ఉన్న లాక్ డౌన్ తో ఏమి చేయాలి, తిరిగి ఎలా కొనుక్కోవాలో అర్ధం కావటం లేదు. అంతే కాదు, హాస్పిటల్ లో కూడా డాక్టర్లు వాడే టిష్యూ లు, ఇతర రక్షణ పరికరాలు లాంటి వాటికి నెమ్మదిగా కొరత ఏర్పడుతోందని నా భర్త చెప్పారు. వీటి సరఫరా సాగకపోతే ఎలా అనే భయం నాకు ఉంది.

 
అయితే, ఈ శానిటైజేషన్ ని ప్రతి ఇంట్లో చేసుకొనవసరం లేదు. డాక్టర్లు, వైరస్ బారిన పడిన వారికి దగ్గరగా పని చేసే ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు ఇళ్ళు శానిటైజ్ చేసుకుంటే మంచిది. అలాగే, నేను కొన్ని ఎస్సెన్షియల్ నూనెలతో కలిసిన దీపాలని పెడుతూ ఉంటాను. ముఖ్యంగా టీ ట్రీ, యూకలిఫ్టస్ నూనె వలన లాభాలు ఉంటాయి.

 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది ధరించాల్సిన రక్షణ సూట్లు, మాస్కులు, ఇతర వైద్య పరికరాల కొరత ఏర్పడుతోందనిప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దేశాలకు హెచ్చరిక జారీ చేసింది.పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా ఈ రక్షణ పరికరాల ఉత్పత్తిని 40 శాతం పెంచమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉత్పత్తిదారులను కోరింది.

 
రోజు రోజుకి పెరుగుతున్న కేసులు తనని భయపెడుతున్నాయా?
నేనైతే టీవీలో వార్తలు చూడటం ఆపేసాను. నేను పెద్దగా భయపడలేదు కానీ, బెంగ పడ్డాను. డాక్టర్లు వాడే రక్షణ పరికరాల కొరత ఏర్పడితే పరిస్థితి ఏమిటనే బెంగ, ఇది తీవ్ర రూపం దాలిస్తే తట్టుకునే వైద్య సదుపాయాలు ఉన్నాయా లాంటి ప్రశ్నలు నన్ను బాగా బెంగకి గురి చేశాయి.

 
ముందు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుందామనుకున్నా. కానీ, నా లాంటి వాళ్ళే అలా చేస్తే, సాధారణ ప్రజలకి మరింత భయం కలుగుతుందని, ప్రతి రోజు వైరస్ గురించి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి పోస్టులు పెడుతూ ఉన్నాను. సాధారణ దగ్గు, జలుబు వచ్చినా చాలా మంది భయపడిపోతున్నారు. నేను నా భర్త సలహా తీసుకుని, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అనవసరంగా భయపడవద్దని, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే అధికారులకి రిపోర్ట్ చేయమని సలహా ఇస్తూ ఉంటాను. ఒక డాక్టర్ భార్యగా నేను నా పరిచయస్తులకి ధైర్యం ఇస్తూ ఉంటాను. నేను ఏది పోస్ట్ చేసినా ఒక సారి డాక్టర్లకి చూపించి అప్పుడు పోస్ట్ చేస్తాను. దానితో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవ్వదు.

 
ఒక చిన్న విషయం పెద్ద గొడవకి దారి తీయవచ్చు
ఈ లాక్ డౌన్ విషయానికి వస్తే ఒక కుక్కర్ విజిల్ పని చేయకపోతే కూడా అదో గొడవకి దారి తీసే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే షాప్ కి వెళ్లి కొని తెచ్చేసుకోవచ్చు. ఒక వేళ కుక్కర్ లేకుండా అన్నం వండటం రాకపోతే, ఇంట్లో వాళ్ళు ఆ చిన్న పని కూడా రాదా అనే చిన్న మాట ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుంది. ఒక చిన్న విషయం ఇంట్లో ఒక పెద్ద గొడవకి దారి తీయవచ్చు.

 
నేను బంధువులకి, దగ్గర కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. అది నన్ను కొంత భయానికి గురి చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటాను. కానీ, నా భర్త నేను కలిసి వంట చేసుకోవడం, ఒకరికొకరు ఆసరాగా నిలవడం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరూ తెలియకపోవడంతో ఏ సహాయం కావాలన్నా ఎవరిని అడగాలో అర్ధం కాదు.

 
ఈ లాక్ డౌన్ ని ఎలా చూస్తున్నారు?
ఈ 21 రోజుల్లో ఇది పూర్తిగా సమసిపోతుందని కూడా చెప్పలేము. ఈ సమయం కేవలం వైద్య సిబ్బందికి రానున్న కేసులను ఎదుర్కోవడానికి సంసిద్ధం కావడానికి మాత్రమే అనిపిస్తోంది. రెండేళ్ల పాపతో ఇంటిలోనే ఉండటం కూడా అలవాటు చేసుకున్నాను. టైం టేబుల్ పెట్టుకుని తనతో కలిసి ఆడుకోవడం, కొత్త ఆటలు నేర్పించడం, పెయింటింగ్ చేయించడం లాంటి పనులు చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ మాకు ఎవరూ తెలియదు. ఏ సమస్య వచ్చినా మాకు మేమే చూసుకోవాలి.

 
మా అమ్మగారు సంగీతం టీచర్. గతంలో నేను చేతులు కడుక్కోమని చెప్పినప్పుడు నన్ను చాదస్తం అని కొట్టి పడేసేవారు. కానీ, ఈ వైరస్ ప్రభావంతో ఇప్పుడిప్పుడే ఇంట్లో అందరూ నేను చెప్పినవే సరైనవి అని పాటించడం మొదలుపెట్టారు. ఇది ఒక్క కరోనా వైరస్ వ్యాప్తి వలన కాదు, ఎప్పుడూ పాటించడం మంచిది.

 
ఈ లాక్ డౌన్ కాస్త ముందే జరిగి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ, ఇప్పుడు కూడా ఒకే సారి లాక్ డౌన్ తీసేస్తే కూడా కేసులు విపరీతంగా పెరిగిపోతాయేమో అనే భయం ఉంది. నా భయాలకి, బెంగకి సంగీతమొకటే సాధనం. నేను పాటలు పాడుకుంటూ ఉంటాను. ఈ ఒత్తిడి నుంచి బయట పడటానికి, ఒకవేళ నాకు పాటలు పాడటం రాకపోయి ఉంటే నేను సంగీతం వింటూ ఉండేదానినేమో.