శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (18:31 IST)

ఆ వైద్య కుటుంబం అంతా కరోనా వైరస్‌ రోగుల చికిత్సలో, నా కుమారుడు కూడా వైద్యుడైతేనా?

వైద్యులు-ఫోటో కర్టెసీ-సోషల్ మీడియా
వైద్యుడు ఆ భగవంతుడుతో సమానం. భగవంతుడు మనిషికి ప్రాణం పోస్తే, ఆ ప్రాణాలు ఏదైనా అనారోగ్య సమస్యకు లోననైప్పుడు తిరిగి ఆరోగ్యంగా మలిచే శక్తి వైద్యుడికి వుంది. అందుకే వైద్యో నారయణో హరిః అన్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఆ వైరస్ సోకిన వ్యక్తి వున్నాడంటే ఆ దరిదాపులకు కూడా వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించడంలేదంటే దానిపట్ల ఎంత భయం ఏర్పడిందో వేరే చెప్పక్కర్లేదు. 
 
ఐతే అలా ప్రాణాలను కబళిస్తుందన్న కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు వైద్యులు అహరహం కృషి చేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఆ వైద్య కుటుంబాన్ని చూసి చేతులెత్తి నమస్కరిస్తున్నారు.
 
వారు డాక్టర్ మహబూబ్ ఖాన్, అతని భార్య డాక్టర్ షహానా ఖాన్ మరియు వారి కుమార్తె డాక్టర్ రషికా ఖాన్ వైద్య సేవకు అంకితమయ్యారు. డాక్టర్ మహబూబ్ ఖాన్ ప్రస్తుతం ఛాతీ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌గా, ఆయన భార్య డాక్టర్ షహానా ఖాన్ గాంధీ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
 
గాంధీ మెడికల్ కాలేజీ నుండి డెర్మటాలజీలో ఎమ్‌డి పూర్తిచేసే ముందు డాక్టర్ షహనా వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ పూర్తి చేశారు. వారి కుమార్తె డాక్టర్ రశికా గాంధీ మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె కొర్నాటి ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్నారు.
 
చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కావడంతో, డాక్టర్ మహబూబ్ ఖాన్ కరోనా వైరస్‌తో పోరాడటంలో ముందున్నారు. రోగులకు ధైర్యం చెపుతున్నారు. కరోనా వైరస్ వచ్చిందని ఆందోళన చెందవద్దనీ, తగిన జాగ్రత్తలతో దాన్ని పారదోలవచ్చని అంటున్నారు. మరోవైపు డాక్టర్ షహానా ఖాన్ చర్మవ్యాధి నిపుణురాలుగా ఉన్నప్పటికీ కోవిడ్ 19 రోగులకు చికిత్స చేయడానికి నియమించబడ్డారు. అదేవిధంగా, మార్చి 26 నుండి కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స చేయడానికి రషిక కూడా వారితో చేరారు.
 
అలా కుటుంబంలో ముగ్గురూ కరోనా వైరస్ నిరోధించేందుకు పోరాడుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మహబూబ్ ఖాన్ మాట్లాడుతూ...“ఇది పరీక్షా సమయం. మానవాళికి సేవ చేసే అవకాశం మాకు లభించింది. పేదలకు సేవ చేయాలనే ఉమ్మడి లక్ష్యం కోసం మేము సమిష్టిగా కృషి చేస్తున్నామని భావిస్తున్నాను. మాకు 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతను కూడా డాక్టర్ అయి ఉంటే, అతను కూడా పేదవారికి సేవ చేయడంలో మాతో కలిసి ఉండేవాడు.” అని అన్నారు.
 
పేదలకు వైద్యం చేయడంలోనూ, ప్రాణాలను నిలబెట్టడంలో అహరహం కృషి చేస్తున్న ఈ వైద్య కుటుంబ సభ్యులకు హ్యాట్సాఫ్ చెపుదాం.