ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (22:20 IST)

ఏపీలో కరోనా కేసులు 161, ఏ జిల్లాలో ఎంతమంది కరోనా వ్యాధిగ్రస్తులు?

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న కోవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్‌. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలు ఇలా వున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 161కి చేరింది.
 
నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 20, వైయస్సార్‌ కడప జిల్లాలో 19, ప్రకాశం జిల్లాలో 17, పశ్చిమ గోదావరిలో 15, విశాఖపట్నం జిల్లాలో 14, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలలో 9 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇక అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 1 కేసు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటివరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు.
 
కోవిడ్‌ –19 విస్తరణ, నివారణా చర్యలపై సీఎం  వైయస్‌ జగన్‌ సమీక్ష: 
రాష్ట్రంలో ఇంటింటికీ వలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు నిర్వహించిన సర్వేపై సీఎం ఆరా తీశారు. రాష్ట్రంలో 1.45 కోట్ల ఇళ్లకు గానూ 1.28 కోట్ల ఇళ్లలో సర్వే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం లాంటి ఏదో ఒక లక్షణం ఉన్న వారిని గుర్తించినట్లు తెలిపారు.
 
రెండో దశలో భాగంగా వీరిని పరిశీలిస్తారని, ఎవరికి పరీక్షలు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు వెల్లడించారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో వార్డుల వారీగా డాక్టర్లను నియమించారా లేదా? అని అధికారులను సీఎం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల వారీగా వైద్యుల మ్యాపింగ్‌ చేశామని చెప్పారు అధికారులు. ఢిల్లీలో సదస్సుకు హాజరైన వారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారికి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు.