ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (17:17 IST)

ఖరీదైన వస్తువుల డెలివరీలో మోసం.. వ్యక్తిగత వివరాలు నేరగాళ్లకు తెలిస్తే ముప్పే

ఓ కొరియర్ బాయ్ ఖరీదైన సరికొత్త ఫోన్ మీ ఇంటి వద్ద మీకు అందజేశారు. ప్యాకేజీపై మీ పేరు కూడా ఉంది. మీకు గుర్తున్నంత వరకు ఆ ఫోన్ మీరు ఆర్డర్ చేయలేదు. తర్వాత మరో కొరియర్ బాయ్ వచ్చి మీ ఇంటి తలుపు కొడతారు. పొరపాటున ప్యాకేజీ మీకు అందజేశామని, వెనక్కు ఇచ్చేయాలని మిమ్మల్ని అడుగుతారు. మీరు అది వెనక్కు ఇచ్చేస్తే చాలా పెద్ద పొరపాటు చేసినట్లే. మీరు ఒక డెలివరీ కుంభకోణం బారిన పడ్డట్లే.

 
బ్రిటన్‌లో అమాయకులను బోల్తా కొట్టించి డబ్బు సంపాదించేందుకు మోసగాళ్లు అనుసరిస్తున్న అధునాతన పద్ధతుల్లో డెలివరీ మోసం ఒకటని బ్రిటన్‌లోని వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ సంస్థ 'విచ్' నిపుణుడు ఆడమ్ ఫ్రెంచ్ చెప్పారు. మోసగాళ్లు మీ అకౌంట్లను హ్యాక్ చేసి, మీ చిరునామాతో ఆర్డర్ చేస్తారు. ప్యాకేజీని మధ్యలోనే తీసుకొనేందుకు యత్నిస్తారు. కుదరకపోతే మీ ఇంటికి వచ్చి, "ఈ ప్యాకేజీ మీకు పొరపాటున వచ్చింది, వెనక్కు ఇచ్చేయండి" అని అడుగుతారు.

 
సాధారణంగా మీ చిరునామా, అకౌంట్ల వివరాలు, ఇతర వ్యక్తిగత వివరాలను నేరగాళ్లు సేకరించినప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతాయి. తమ పేరుతో ఎవరో ఆగంతకులు ఫోన్ ఆర్డర్ ఇచ్చే స్థాయికి వెళ్లగలగడం తమకు ఆందోళన కలిగించిందని ఇలాంటి మోసం బారిన పడ్డ ఒక బాధితుడు బీబీసీతో చెప్పారు. తాము అప్పట్లో ఇల్లు కొంటున్నామని, ఇలాంటి మోసాలు తమ రుణ పరపతిపై చూపే ప్రభావం గురించి ఆందోళన చెందామని ఆయన తెలిపారు.

 
మరో బాధితురాలు మాట్లాడుతూ- "మేం మా ఇంటి నుంచి మరో చోటకు మారాక మా ఇంటిని అద్దెకు ఇచ్చాం. మేం మా ఇంటి నుంచి వచ్చేశాక సంవత్సర కాలానికి మా ఇంట్లో అద్దెకుంటున్నవారు మాకు ఫోన్ చేసి, 'మీకు పార్సిల్ వచ్చింది' అని చెప్పారు" అని తెలిపారు. "మేం ఏదీ ఆర్డర్ ఇవ్వలేదు కానీ ఆ సమయానికి ఆ ప్రాంతంలో ఉండటంతో పార్సిల్ తీసుకోవాలనుకున్నాం. 

 
పార్సిల్‌లో అప్పుడే విడుదలైన రెండు శామ్‌సంగ్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లను పంపించిన కార్‌ఫోన్ వేర్‌హౌస్ సంస్థను సంప్రదించాం. వీటికి ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చారనే సమాధానం వచ్చింది. నా భర్త పేరు మీద ఉన్న ఓ 'హాలిఫాక్స్ ఖాతా'తో అనుసంధానమైన కాంట్రాక్టుపై ఈ ఆర్డర్ ఇచ్చారు" అని ఆమె వివరించారు.

 
వాస్తవానికి ఈ జంట హాలిఫాక్స్ ఖాతా తెరవనే లేదు. ఫోన్లు ఆర్డర్ ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై వారు యూకేలో ప్రభుత్వ విభాగమైన 'యాక్షన్ ఫ్రాడ్'‌కు తెలియజేశారు. ఆ ఫోన్లను వెనక్కు తీసుకొనేందుకు మరో కొరియర్ యత్నించవచ్చని యాక్షన్ ఫ్రాడ్ సిబ్బంది వారికి బదులిచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆ జంట, ఫోన్లను కార్‌ఫోన్ వేర్‌హౌస్‌కు పంపించింది.

 
నేరగాళ్లకు తమ వ్యక్తిగత సమాచారం తెలిసిపోవడంపై ఆ జంట ఆందోళనకు గురైంది. వాళ్లు తమ సమాచారం తెలుసుకొన్నారని, వాళ్ల తప్పుడు పని వల్ల తమ రుణ పరపతికి నష్టం కలిగించి ఉండొచ్చని ఆ జంట చెప్పింది. ఇలాంటి కుంభకోణాలు బ్రిటన్‌లో పెరుగుతున్నాయి.

 
ఏం చేయాలి?
ఎవరైనా కొరియర్ అనుకోకుండా ప్యాకేజీని వెనక్కు తీసుకోవడానికి మీ ఇంటికి వస్తే, అది ఇవ్వకండి. కొరియర్ వివరాలు సరిచూసుకోవాలి. అతడు చెబుతున్న కంపెనీకి ఫోన్ చేసి నిర్ధరించుకోవాలి. ఆందోళన కలిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే ఘటనలు పెరుగుతున్నాయని, బ్యాంకు ఖాతాకు సంబంధించి ఏదైనా లావాదేవీ అనుమానాస్పదంగా అనిపిస్తే బ్యాంకుకు తెలియజేయాలని నిపుణుడు ఆడమ్ ఫ్రెంచ్ సూచించారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లు లాంటి వ్యక్తిగత పత్రాలను ఎక్కడపడితే అక్కడ వదిలేయకూడదని, పారేయాలనుకొంటే చించి పారేయాలని ఆయన చెప్పారు.