బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (12:53 IST)

దక్షిణ సెంట్రల్ రైల్వే ఖాతాలో మరో ఘనత- 574 స్టేషన్లలో ఉచిత వైఫై

దక్షిణ సెంట్రల్ రైల్వే పరిధిలో 574 స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వేకు చెందిన టెలికాం కంపెనీ రైల్ టెల్, గూగుల్‌తో  కలిసి రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పించింది. తద్వారా రైల్వే జోన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించిన రెండో జోన్‌గా దక్షిణ మధ్య రైల్వేకు ఘనత దక్కింది. 
 
హాల్ట్ స్టేషన్లను మినహాయించి ఈ వైఫై లభిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ1 కేటగిరీలో 5 రైల్వే స్టేషన్లు, ఏ కేటగిరీలో 31, బీ కేటగిరీలో 38, సీ కేటగిరీలో 21, డీ కేటగిరీలో 78, ఈ కేటగిరీలో 387, ఎఫ్ కేటగిరీలో 2, కొత్తగా నిర్మించిన 12 రైల్వే స్టేషన్లున్నాయి. 
 
ఈ రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులోకి వచ్చింది. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరోసారి ఏ రైల్వేస్టేషన్‌లో మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కేవలం వైఫై ఆన్ చేస్తే చాలు. ఆటోమెటిక్‌గా రైల్‌వైర్ వైఫై కనెక్ట్ అవుతుంది. రైల్‌వైర్ వైఫై హాట్‌స్పాట్‌ను 30 నిమిషాల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఒకరు 350 ఎంబీ డేటా మాత్రమే ఉచితంగా ఉపయోగించుకోగలరు.