బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 మే 2020 (07:46 IST)

కరోనా కష్టాలకు తోడు దొడ్డిదారిన పెట్రో ధరల బాదుడు...

దేశంలోని ప్రతి ఒక్క పౌరుడిని కరోనా కష్టాలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఉపాధిని కోల్పోయి తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. అదేసమయంలో మార్చి 24వ తేదీ నుంచి లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు.. బడా కంపెనీలు మూతపడ్డాయి. ఈ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఛిన్నాభిన్నమైపోయింది. 
 
ఇలా ప్రతి ఒక్కరూ నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్రం ప్రజలపై మరోమారు భారం మోపింది. పెట్రోలు, డీజిల్ ధరలను రికార్డు స్థాయిలో పెంచింది. లీటరు పెట్రోలుపై రూ.10, లీటరు డీజిల్‌పై రూ.13 మేరకు ఎక్సైజ్ సుంకాలను పెంచింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 
 
నిజానికి 2014లో నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో పెట్రోలుపై రూ.9.48, డీజిలుపై రూ.3.56 మేరకు పన్నులు ఉండేవి. ఆపై ఎన్డీయే సర్కారు వరుసగా దొడ్డిదారిన పన్నులను పెంచుకుంటూ వచ్చింది. గడచిన మార్చిలో సైతం పెట్రో ఉత్పత్తులపై రూ.3 శాతం సుంకాన్ని విధించింది. తాజా నిర్ణయంతో సుంకాలు పెట్రోలుపై రూ.32.98, డీజిలుపై రూ.31.83కు పెరిగాయి.
 
నిజానికి కరోనా దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో పాకిస్థాన్ వంటి పొరుగు దేశాల్లో పెట్రోల్ ధరలను తగ్గించారు. కానీ, మన దేశంలో మాత్రం ఆ ఫలాలు మాత్రం ప్రజలకు అందకుండా కేంద్రం పన్నుల రూపంలో బాదుతోంది. తగ్గిన ధరల మేరకు పన్నులను పెంచడం ద్వారా ఖజానాకు కోత పడకుండా చూసుకుంటూ వస్తోంది. 
 
ఫలితంగా అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గినా మన దేశంలో మాత్రం వాటి ధరల్లో ఏమాత్రం మార్పు కనిపించలేదు. ఇకపోతే, పెరిగిన సుంకాలతో ప్రజలపై ఎటువంటి అదనపు భారమూ పడబోదని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానించారు. ఇటీవల ధరలు భారీగా తగ్గాయని గుర్తు చేశారు.