ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (02:35 IST)

అమ్మలో అంతటి సమ్మోహన శక్తి: భోరుమన్న శశికళ

అన్నాడీఎంకే దివంగత అధినేత్రి జయలలితలో ఉన్న సమ్మోహన శక్తిని మరెవ్వరిలోనూ తాను చూడలేదని ఆ పార్టీ ప్రస్తుత తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ప్రశంసించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు అమ్మ మెమోరియల్‌కు వెళ్లానని, అయితే అక్కడ్నించి తనకు వెనక

అన్నాడీఎంకే దివంగత అధినేత్రి జయలలితలో ఉన్న సమ్మోహన శక్తిని మరెవ్వరిలోనూ తాను చూడలేదని ఆ పార్టీ ప్రస్తుత తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ప్రశంసించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు అమ్మ మెమోరియల్‌కు వెళ్లానని, అయితే అక్కడ్నించి తనకు వెనక్కి రావాలనిపించలేదని, అంతటి సమ్మోహన శక్తి అమ్మలో ఉందని గుర్తుచేసుకున్నారు. అమ్మ ఆశయాలు, పార్టీని తుదిశ్వాస వరకూ కాపాడుకోవాలని ఆ నిమిషంలోనే తాను నిర్ణయించుకున్నట్టు ఎమ్మెల్యేలకు శశికళ చెప్పారు. 
 
వరుసగా రెండో రోజు కూడా కువకోళం లోని రిసార్టులో క్యాంప్‌లో ఉన్న అన్నాడిఎంకే ఎమ్మెల్యేలను కలిసిన శశికళ మనం ఐక్యంగా ఉంటే పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని దిశానిర్దేశం చేశారు. 
'విజయం మనదే...అమ్మ స్మారకం వద్దకు కలిసికట్టుగా వెళ్లి ఆ విజయాన్ని ఆమెకు అంకింతం ఇద్దాం. ఇందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనుదాం' అని శశికళ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా 'అమ్మ'ను తలుచుకుని శశికళ కంటతడి పెట్టారు. చిన్నమ్మ కంటతడి పెట్టడంతో ఎమ్మెల్యేలు సైతం దుఖసాగరంలో మునిగిపోయారు. 'మీరంతా అండగా నిలిస్తే ఏదైనా సాధించి తీరుతాను. మడం తిప్పేది లేదు. అమ్మతో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అంతే దృఢ సంకల్పంతో పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాను' అని శశికళ పార్టీ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. 
 
'మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత అమ్మ మెమోరియల్‌కు వెళ్లి ఫోటో దిగాలి. అది ప్రపంచమంతా చూడాలి. అందుకోసం ప్రతినబూనుదాం' అని శశికళ ఉద్వేగంగా అన్నారు. పన్నీర్‌ సెల్వంపైనా ఈ సందర్భంగా ఆమె నిప్పులు కురిపించారు. చాలాకాలంగా పార్టీలో మంత్రిగా ఉంటూ ఈరోజు పార్టీని ఆయన ధ్వసం చేయాలనుకున్నారని, తన వేలితో తానే కన్ను పొడుచుకున్నారని ఎద్దేవా చేశారు. పార్టీని కానీ, ప్రభుత్వానికి ఎవరూ కనీసం తాకనైనా తాకలేరని శశికళ సవాలు చేశారు.