శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 నవంబరు 2020 (13:32 IST)

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 5.30 కోట్లు.. భారత్‌లో..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజులు గడుస్తున్నా ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5.30 కోట్లకు చేరింది. ఒక్క భారత్‌లో ఈ కేసుల సంఖ్య 88 లక్షలకు చేరింది. 
 
ముఖ్యంగా, ఈ కరోనా వైరస్ ప్రభావం మళ్లీ పెరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే.. శుక్ర‌వారం రాత్రి నుంచి శ‌నివారం రాత్రి వ‌ర‌కు కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప్ర‌పంచంలో రికార్డు స్థాయిలో 6,57,312 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా విస్తృతి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప్ర‌పంచ‌దేశాలన్నింటిలో క‌లిపి ఒకేరోజు ఇంత భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వ‌డం తొలిసారి కావడం గమనార్హం. 
 
కొత్త‌గా న‌మోదైన కేసులతో క‌లిపి ప్ర‌పంచంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5.30 కోట్లు దాటింది. అలాగే, ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా వేగంగా పెరిగిపోతున్న‌ది. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభన మొద‌లైన‌ప్ప‌టి నుంచి శ‌నివారం రాత్రి వ‌ర‌కు ప్ర‌పంచవ్యాప్తంగా ఆ వైర‌స్ బారినప‌డి మ‌ర‌ణించిన వారి సంఖ్య 13,09,713కు చేరింది. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 
 
ఇకపోతే, దేశంలో మరో 41 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ఈ హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 41,100 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,14,579 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,156 మంది కోలుకున్నారు.
 
అలాగే, గడచిన 24 గంట‌ల సమయంలో 447 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,29,635 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 82,05,728 మంది కోలుకున్నారు. 4,79,216 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.              
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,48,36,819 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,05,589 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
ఇకపోతే, తెలంగాణలో గత 24 గంటల్లో  661 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 1,637 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,374 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,40,545 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,404 కి చేరింది. ప్రస్తుతం 15,425 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 12,899 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 167 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 57 కేసులు నిర్ధారణ అయ్యాయి.