శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (08:29 IST)

తెలంగాణాలో కరోనా సమూహ వ్యాప్తి లేదు : ఐసీఎంఆర్ సర్వే

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమూహ వ్యాప్తి చెందిందన్న భయం పట్టుకుంది. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ - ఐసీఎంఆర్ ఓ ప్రటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి చెందలేదని పేర్కొంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో కమ్యూనిటీ స్ప్రెడ్ సాగలేదని స్పష్టం చేసింది. 
 
ఇందుకోసం ఐసీఎంఆర్ హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్ జోన్లతో పాటు... రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నమూనాలను సేకరించి, పరీక్షించింది. ఈ పరీక్షల్లో ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కరోనా వైరస్ సమూహ వ్యాప్తి చెందలేదని పేర్కొంది. అందువల్ల భాగ్యనగరి వాసులతో పాటు.. రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొంది. 
 
ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. రోజురోజుకు వందల్లో పెరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 191 కేసులు నమోదయ్యాయి. అలాగే, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,111కి చేరుకోగా, 156 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వెలుగు చూసిన వాటిలో 143 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
 
మేడ్చల్‌, సంగారెడ్డిలో 11 చొప్పున, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాల, మెదక్‌లో మూడు చొప్పున కేసులు నమోదు కాగా, నాగర్‌కర్నూల్, కరీంనగర్‌లో రెండేసి, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్ధిపేటలో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,817 మంది డిశ్చార్జ్ కాగా, 2,138 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.