మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (10:25 IST)

క్రీజ్‌లో స్థిరపడేవరకు ఆ తప్పు చేయొద్దు.. కోహీకి గవాస్కర్ సలహా

భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఓ చిన్న సలహా ఇచ్చారు. క్రికెట్‌లో స్థిరపడేంతవరకు ఆఫ్‌సైడ్‌లో దూసుకొచ్చే బంతులను టచ్ చేయొద్దని హితవు పలికాడు.  
 
గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ టెస్టుల్లో తడబడుతున్న సంగతి తెలిసిందే. టెక్నిక్‌లో పెద్దగా లోపాలు లేకపోయినప్పటికీ, ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడడంలో కోహ్లీ రాంగ్ స్టెప్ వేస్తున్నట్టు ఇటీవల రెండు టెస్టుల్లో అతడు అవుటైన తీరు చెబుతోంది.
 
ఈ నేపథ్యంలో, కోహ్లీ ఫాంపై భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. క్రీజులో సెటిలయ్యే వరకు ఆఫ్ స్టంప్‌కు ఆవల పడే బంతులను ఆడకపోవడమే మంచిదని సూచించాడు. ఈ విషయంలో సచిన్ ఆలోచనా తీరును అలవర్చుకోవాలని కోహ్లీకి సలహా ఇచ్చాడు.
 
గతంలో సిడ్నీ టెస్టులో సచిన్ ఆఫ్ స్టంప్‌కు అవతల పడే బంతులను ఎలాంటి షాట్లు ఆడకుండా వదిలేశాడని, ఈ ఎత్తుగడ సత్ఫలితాన్ని ఇచ్చిందని, ఆ మ్యాచ్‌లో సచిన్ ఆసీస్‌పై 250 పరుగులుపైగా చేశాడని గవాస్కర్ గుర్తు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో సచిన్ ఆఫ్ సైడ్ ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడలేదని, దాదాపుగా అన్నీ స్ట్రెయిట్ షాట్లే ఆదాడని, తనను తాను అద్భుతంగా నియంత్రించుకుని డబుల్ సెంచరీ సాధించాడని వివరించారు.
 
కోహ్లీ కూడా సచిన్ ప్లాన్‌ను పాటిస్తే ఖచ్చితంగా పరుగులు వెల్లువ సృష్టిస్తాడని అభిప్రాయపడ్డాడు. కాగా, బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టు డిసెంబరు 14 నుంచి బ్రిస్బేన్‌లో జరగనుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా చెరో టెస్టు నెగ్గి 1-1తో సమంగా ఉన్నాయి.