ఆదివారం, 9 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మార్చి 2025 (16:51 IST)

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ : కివీస్ రెక్కలు విరిచిన కుల్దీప్ యాదవ్

kuldeep - rachin
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కివీస్ జట్టును భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దెబ్బకొట్టాడు. సరైన సమయంలో వికెట్లు తీసి భారత జట్టు శిబిరంలో ఆనందం నింపాడు. 
 
ఓ దశలో పది ఓవర్లలో వికెట్ నష్టానికి 69 పరుగులు చేసి పటిష్టమైనస్థితిలో ఉంది. ఆ సమంయలో కుల్దీప్ యావద్ విజృంభించి రెండు వికెట్లు తీశాడు. తొలుత ధాటిగా ఆడుతున్న రచిన్ రవీంద్ర (37)ను ఔట్ చేసిన కుల్దీప్.. తన తర్వాత ఓవర్‌లో అత్యంత కీలకమైన కేన్ విలియమ్సన్ (11) వికెట్‌ను నెలకూల్చాడు. దీంతో కివీస్ దూకుడుకు కళ్లెంపడింది. 
 
ప్రస్తుతం కివీస్ జట్టు  37 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఇందులో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్రా 37, కేన్ విలియమ్సన్ 11, మిచెల్ 33 (నాటౌట్), లాథమ్ 14, ఫిలిప్స్ 18 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, జడేజాలు ఒక్కో వికెట్ తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.