బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (09:12 IST)

కెప్టెన్సీని త్యజించేలా ధోనీతో వ్యవహరించారు.. జట్టు సభ్యులు కూడా...

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డే, టీ-20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఉరుములు, మెరుపులులేని వానలా ధోనీ రాజీనామా నిర్ణయం తీసుకోవడం, దాన్ని అధికారికంగా ప్రకటించడం అంతా చకచకా జరిగిపోయి

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డే, టీ-20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఉరుములు, మెరుపులులేని వానలా ధోనీ రాజీనామా నిర్ణయం తీసుకోవడం, దాన్ని అధికారికంగా ప్రకటించడం అంతా చకచకా జరిగిపోయింది. ధోనీ కెప్టెన్సీకి రాజీనామా చేశాడంటూ గత రెండు రోజులుగా వార్తా పత్రికలు, మీడియా ఛానెళ్లు పేర్కొంటున్నాయి. 
 
ఈ నేపథ్యంలో అసలు ధోనీ తనకు తానుగా రాజీనామా చేశాడా? లేక ధోనీతో రాజీనామా చేయించారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ధోనీ రాజీనామాకు పెద్దగా కారణాలు కనిపించడం లేదు. కానీ, జట్టు సభ్యులు పాటు.. చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్, రవిశాస్త్రి వంటివారు ధోనీతో వ్యవహరించిన తీరును పసిగట్టిన ధోనీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. 
 
వాస్తవానికి ధోనీ రాజీనామా డిమాండ్ లేనప్పటికీ జట్టులో పరిస్థితులన్నీ ధోనీకి వ్యతిరేకంగా మారాయి. ధోనీ గాయపడిన సమయంలో రవిశాస్త్రి చొరవతో టెస్టు కెప్టెన్‌గా కోహ్లీని నియమించడం జరిగింది. అలా వచ్చిన తాత్కాలిక కెప్టెన్సీ అవకాశాన్ని కోహ్లీ వినియోగించుకుని అక్కడ స్థిరపడిపోయాడు. ఈ క్రమంలో వర్థమాన ఆటగాళ్లంతా కోహ్లీకి అనుకూలంగా మారారు.  
 
ధోనీ కోటరీలోని ఆటగాడిగా పేర్కొనే అశ్విన్ లాంటి ఆటగాడికి కూడా ఒక దశలో ధోనీతో పొసగలేదు. ఈ క్రమంలో ధోనీకి భవిష్యత్ నెమ్మదిగా అర్థమైంది. దీంతో టెస్టు కెప్టెన్సీని పూర్తిగా వదిలేసుకున్న తర్వాత ఆలోచనలో పడ్డాడు. దీనికితోడు ప్రపంచ కప్‌కు సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో జట్టు ఎలా ఉండాలన్న ఆలోచనను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, ధోనీకి వివరించాడు. దీంతో రాజీనామాకు సమయం దగ్గరవుతోందని భావించిన ధోనీ, ఆలస్యం అమృతం విషం అని భావించి వెంటనే కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. 
 
ఇక ఆటగాడిగా ధోనీ రిటైర్మెంట్‌కు కూడా సమయం దగ్గరపడుతోంది. గతంలో జరిగిన సిరీస్‌లలో బ్యాటుతో ధోనీ రాణించిన దాఖలాలులేవు. ఈసారి కూడా ధోనీ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆశించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ తర్వాత ధోనీ పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశాలు లేకపోలేదు. అలా జరిగితే ధోనీ కెరీర్ శుభప్రదంగా ముగిసినట్టే. 
 
లేదంటే... భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్ల సరసన ధోనీ కూడా నిలవాల్సి వస్తుంది. వీరంతా ఒకప్పుడు టీమిండియాలో స్టార్ ఆటగాళ్లుగా వెలిగారు. కెరీర్ చివరి దశలో వీరికి సరైన వీడ్కోలు కూడా లభించక, బ్రాండ్ వాల్యూపడిపోయి, రంజీలకే పరిమితమై ఒక్క అవకాశం ఇస్తే అంతర్జాతీయ ఆటగాడిగా రిటైర్ అయ్యేందుకు ఆశగా ఎదురు చూస్తున్నారు.