సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 10 జనవరి 2025 (18:47 IST)

ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం, కళ్ల కింద నల్లని చారలు, విపరీతమైన ఒత్తిడి, ఓ ఉద్యోగిని సూసైడ్

Depression
ఇదివరకు బ్యాంక్ ఉద్యోగం అంటే అబ్బో ఇక జీవితం సెటిల్ అయిపోయినట్లే అనుకునేవారు. కానీ రానురాను ఆ ఇమేజ్ కాస్తా డ్యామేజ్ అవుతోంది. ప్రైవేట్ బ్యాంకులతో పాటు ప్రభుత్వ బ్యాంకులలో కూడా విపరీతమైన పని ఒత్తిడి వుంటోందని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. ప్రత్యక్షంగానే కొంతమంది ఉద్యోగులను చూసినప్పుడు కళ్లకింద పని ఒత్తిడిని తెలిపే కళ్లకింద నల్లటి క్యారీబ్యాగుల్లా చారలు కనిపిస్తున్నాయి. ఇంతటి ఒత్తిడిని తట్టుకోలేక పలువురు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. గురువారం నాడు ఇలాంటి విషాదకర ఘటన జరిగింది.
 
హైదరాబాదులోని బాచుపల్లి ఠాణా పరిధిలో నివాసం వుంటున్న బ్యాంకు ఉద్యోగిని లావణ్య భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నది. పూర్తి వివరాలు చూస్తే.... ఏపీలోని పిఠాపురంకి చెందిన లావణ్య భర్త హైదరాబాదులో ఐటి ఉద్యోగి. ఈమె బ్యాంకు ఉద్యోగిగా బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్‌లో వున్న ఓ ప్రభుత్వ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈమధ్య తనకు బ్యాంకులో విపరీతమైన పని ఒత్తిడి వున్నట్లు చెప్తుండేవారు. తరచూ ఈ విషయాన్ని బంధుమిత్రుల వద్ద చెపుతూ బాధపడుతుండేవారు.
 
ఐతే సంక్రాంతి పండుగకు సొంతఊరు పిఠాపురం వెళ్లేందుకు సెలవు పెట్టి శుక్రవారం ప్రయాణం చేద్దామని అన్నీ సర్దుకున్నారు. గురువారం మధ్యాహ్నం బ్యాంకు అధికారులకు విషయం చెప్పి ఇంటికి వెళ్లింది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ తను నివాసం వుంటున్న అపార్టుమెంట్ టెర్రస్ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయపడిన ఆమెను సమీప ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. లావణ్య మామయ్య విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.