బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...
ఓ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన కొందరు కామాంధులు ఆ బాలిక గర్భవతి అని తెలియగానే ఆమెను సజీవంగా పాతిపెట్టేందుకు యత్నించారు. ఈ దారుణ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని జగత్ సింగ్ పూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జిల్లాలోని కుజంగ్ అనే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికపై పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయం తెలుసుకున్న కామాంధులు... ఆ బాలికను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సజీవంగా పాతిపెట్టేందుకు యత్నించారు. నిర్మానుష్య ప్రాంతంలో తవ్విన గుంతను చూసిన ఆ బాలిక భయభ్రాంతులకుగురై ఆ కామాంధుల నుంచి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి వచ్చింది.
ఆ తర్వాత జరిగిన విషయం ఇంట్లో చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలికను ఆస్పత్రికి తరలించి, నిందితులను అరెస్టు చేశారు. వీరిని స్థానికంగా ఉండే భాగ్యధర్ దాస్, పంచనన్ దాస్ అనే సోదరులతో పాటు వారి స్నేహితుడు తుళు బాబుగా గుర్తించారు. అన్నదమ్ములను అరెస్టు చేసిన పోలీసులు... పరారీలో ఉన్న తుళు బాబు కోసం గాలిస్తున్నారు.