శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 18 జులై 2017 (09:31 IST)

రైతు బిడ్డ.‌.. కాబోయే ఉపరాష్ట్రపతి... వెంకయ్య అలుపెరుగని రాజకీయ ప్రస్థానం

ఎం.వెంకయ్య నాయుడు అలియాస్ ముప్పవరవు వెంకయ్య నాయుడు. ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. సొంతూరు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సమీపంలో ఉన్న చౌటపాలెం. తల్లిదండ్రులు రంగయ్యనాయుడు, రమణమ్మ. ఎలాంటి రాజకీయ వ

ఎం.వెంకయ్య నాయుడు అలియాస్ ముప్పవరవు వెంకయ్య నాయుడు. ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. సొంతూరు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సమీపంలో ఉన్న చౌటపాలెం. తల్లిదండ్రులు రంగయ్యనాయుడు, రమణమ్మ. ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు. నిబద్ధత.. క్రమశిక్షణే ఆలంబన. మహాత్ముల ఆశయాలు, ఆలోచనలే మార్గదర్శకాలు. స్వయంకృషితో ప్రకాశిస్తూ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఎన్నో పదవులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. తన వాగ్ధాటి, చతురతతో మాటల మాంత్రికుడిగా పేరొందారు. మాతృ భాష అంటే ఎంతో మమకారం. బహుభాషా కోవిదుడు.
 
అంతేనా.. ఒకనాడు వాజపేయి, అద్వానీల వాల్‌‌పోస్టర్లు అతికించిన వ్యక్తి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఆయనే అర్హుడని ముక్తకంఠంతో కమలనాథులంతా తీర్మానించడం గమనార్హం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనకడుగు వేయక.. దీక్షాదక్షతలతో ముందుకు సాగారు. ఆయన దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఆయనే ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు. 
 
దేశ ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టనున్న రెండో తెలుగోడు వెంకయ్య నాయుడు. తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కూడా తెలుగువాడే. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఒక గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సర్వేపల్లి వరుసగా పదేళ్లు ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. అనంతరం రాష్ట్రపతి అయ్యారు. ఆ తర్వాత 60 ఏళ్లకు తిరిగి ఒక తెలుగువాడికి ఉప రాష్ట్రపతిగా అవకాశం దక్కింది.
 
1949 జూలై 1న జన్మించిన వెంకయ్య నెల్లూరు వీఆర్‌ హైస్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించారు. వీఆర్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు. విశాఖలోనే ఆయన రాజకీయ ప్రస్థానానికి బీజం పడింది. ఏబీవీపీలో విద్యార్థి సంఘం నేతగా పని చేశారు. వర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆర్ఎస్ఎస్‌లో కీలక పాత్ర పోషించారు. కాకాని వెంకటరత్నం నేతృత్వంలో 1972లో ప్రారంభమైన జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించారు. అపుడే ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. 
 
సోషలిస్టు నేత జయప్రకాశ్‌ నారాయణ్‌ అవినీతికి వ్యతిరేకంగా స్థాపించిన ఛత్ర సంఘర్ష్‌ సమితికి ఆంధ్రప్రదేశ్‌ కన్వీనర్‌గా 1974లో నియమితులయ్యారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక 1977లో జనతా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అక్కడి నుంచి రాజకీయంగా వెనుదిరిగిచూడలేదు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంకయ్య... బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు.
 
అనంతరకాలంలో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి 1998లో కర్ణాటక నుంచి తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 2004, 2010ల్లో కూడా అదే రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లారు. 1999లో వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తున్న వెంకయ్య కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. 2002-2004 మధ్యకాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు. 
 
నినాదాలు ఇవ్వడంలో వెంకయ్య ఆయనకు ఆయనే సాటి. మోదీ అంటే ‘మేకింగ్‌ ఆఫ్‌ డెవలప్డ్‌ ఇండియా’ అనే నినాదం ఆయనదే. ఇప్పుడది మోదీ సర్కారు అధికార నినాదమైంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు వారధిగా నిలిచి.. పార్లమెంటు సజావుగా సాగడానికి కృషి చేశారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడంలో వెంకయ్య కృషి మరువలేనిది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా స్మార్ట్‌ సిటీ, అమృత్‌, స్వచ్ఛ భారత్‌, అందరికీ ఇళ్లు వంటి పథకాలను ప్రవేశపెట్టారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన విజయవంతమైంది.