గురువారం, 13 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మే 2024 (12:01 IST)

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు : జనం గుండెల్లో స్థానం సంపాదించుకుని గేమ్ ఛేంజర్‌గా జనసేన

glass tumbler
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ ఒంటరిగా పోటి చేయగా, టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. ఇందులో జనసేన పార్టీ అత్యంత కీలకంగా వ్యవహరించింది. ఆ పార్టీ మొత్తం 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసింది. ఇందులో 18 చోట్ల గెలుపు తథ్యమని, 3 చోట్ల గట్టిపోటీ ఉందని పార్టీ అంతర్గత అంచనాలు పేర్కొంటున్నాయి. పోలింగు పూర్తయ్యాక పరిస్థితుల్ని విశ్లేషించి, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా పార్టీ వర్గాలు ఈ లెక్కలు వేశాయి. 
 
ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని సమాచారం. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై అంచనాలు వేసుకుంటున్నారు. భారీ మెజారిటీ వస్తుందనే ధీమాతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బరిలో నిలిచిన తెనాలిలోనూ గెలుపు ఖాయంగా మారింది. అక్కడ వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యవహరించిన తీరు సంచలనమైంది. ఆయన పోలింగ్ కేంద్రంలో ఓటరును కొట్టడంతో నియోజకవర్గంలో వైకాపాకు మరింత ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. 
 
పాలకొండ, పోలవరం వంటి ఎస్టీ రిజర్వు నియోజకవర్గాల్లో జనసేన పోటీకి దిగింది. తొలుత అక్కడ గట్టి పోటీ కనిపించినా చివరకు రెండు స్థానాల్లోనూ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. రాజోలులో జనసేనకు మద్దతు ఏకపక్షంగా లభించిందని క్షేత్రస్థాయి సమాచారం. గన్నవరంలో కొంతమేర పోటీ ఎదురైందని చెబుతున్నారు. రాజానగరంలో తొలుత గట్టిపోటీ ఉంటుందని భావించినా చివరకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలుస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. నెల్లిమర్లలో తొలుత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా క్రమేణా అభ్యర్ధి మాధవి... టీడీపీ శ్రేణులతో కలిసి పని చేయడం, ఆ పార్టీ ఇన్ఛార్జి పూర్తిస్థాయిలో సహకరించడం కలిసొచ్చింది. ప్రస్తుత సమాచారం ప్రకారం పి.గన్నవరం, రైల్వేకోడూరు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైందని సమాచారం. వీటిలో కొద్ది మెజారిటీతోనైనా బయటపడతామనే ధీమాతో పార్టీ వర్గాలు ఉన్నాయి.
 
ఇకపోతే, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో పూర్తి అనుకూల పరిస్థితులున్నాయని అంచనా. కాకినాడ లోక్సభ స్థానంలో కొంతమేర క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. కాకినాడ గ్రామీణ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన బరిలో నిలవడం, పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేయడం ఇక్కడ లోక్‌సభ అభ్యర్థికి అనుకూలాంశాలయ్యాయి. సామాజికవర్గంతో పాటు టీడీపీ, బీజేపీ పొత్తు ఈ లోక్‍‌సభ  నియోజకవర్గంలో జనసేనకు సానుకూలమైంది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ క్యాడర్, యువత ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. కూటమి మద్దతు ఇచ్చిన అనేక నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు జనసేన యువత అండగా నిలిచారు. కొన్నిచోట్ల ఇబ్బంది పెడుతున్న ప్రత్యర్థులను క్యాడర్ గట్టిగా ఢీకొంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోలింగ్ తర్వాత చాలా ఉత్సాహంగా ఉన్నారని సమాచారం.