కుప్పకూలనున్న ఆప్ఘన్ ఆర్థిక వ్యవస్థ - మూతపడుతున్న బ్యాంకులు
తాలిబన్ తీవ్రవాదుల వశమైన ఆప్ఘనిస్థాన్ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలనుంది. ఆప్ఘన్‌లో తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత ప్రజలు భారీ మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేశారు. దీంతో బ్యాంకుల్లో నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. పైగా, విదేశాల నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయాయి. దీంతో అనేక బ్యాంకులు పనిచయడం లేదు. అదే సమయంలో ఆఫ్గన్‌లో రిజర్వు నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో అఫ్గన్ బ్యాంకింగ్ రంగం కుప్పకూలేందుకు సిద్ధంగా ఉంది.
ఈ విషయాన్ని సాక్షాత్తూ 'ఇస్లామిక్ బ్యాంక్ ఆఫ్ అఫ్గానిస్థాన్' చీఫ్ సయ్యద్ మూసా అల్ ఖలీమ్ అల్ ఫలాహి తెలిపారు. దేశంలో ఆర్థిక రంగం మనుగడ కోసం పోరాటం చేస్తోందన్నారు. కాబుల్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల రీత్యా దుబాయ్‌లో ఉన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆఫ్గన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 40శాతం వరకు విదేశీ సాయంగా అందే నిధులు, ప్రపంచ బ్యాంకు నిధులపైనే ఆధారపడి ఉన్నాయి. పశ్చిమ దేశాలు అంతర్జాతీయ నిధులను పూర్తిగా నిలిపివేశాయి. వరల్డ్ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి కూడా ఆఫ్గన్ ప్రభుత్వం సొమ్ము తీసుకోకుండా చేశాయి. ఫలితంగా తాలిబన్లు నిధుల కోసం ఇతర మార్గాలపై ఆధారపడటం మొదలుపెట్టారని అల్ ఫలాహి తెలిపారు.
ముఖ్యంగా చైనా, రష్యా వంటి దేశాల నుంచి తాలిబన్లు నిధులు సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా సుమారు 31 మిలియన్ల యువాన్ల సొమ్మును సాయంగా అందజేసింది. అయినా కానీ, ఆ మొత్తం దేశంలో ఆర్థిక సమస్యలు తీర్చడానికి తాలిబన్లకు ఏమాత్రం సరిపోలేదు.
మరోపక్క నార్వేజియన్ రిఫ్యూజీ కౌన్సిల్ కూడా అఫ్గాన్ ఆర్థిక స్థితిపై హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళ్తోందని హెచ్చరించింది. బ్యాంకింగ్ వ్యవస్థ ఏ రోజైనా కుప్పకూలిపోవచ్చని తెలిపింది.