తాలిబన్ల అరాచకం... ఆప్ఘనిస్థాన్‌లో మీడియా సంస్థలపై ఉక్కుపాదం..
ఆప్ఘనిస్థాన్ దేశంలో తాలిబన్ తీవ్రవాదుల అరాచకాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. ఇందులోభాగంగా, ఆ దేశంలో మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఆప్ఘన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు వశం చేసుకున్నాక అక్కడి మీడియా సంస్థలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. అలా ఇప్పటివరకు ఏకంగా 150కి పైగా మీడియా సంస్థలు మూతపడ్డాయి. దీంతో అక్కడి జర్నలిస్టులు ఆందోళనకు గురవుతున్నారని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
అంతేకాకుండా, మతానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ పెద్దలను అవమానించేలా ఉండే వార్తలను ప్రచురించకుండా ఉండేందుకు తాలిబన్లు 11 నియమాల పేరుతో కొత్తగా ఓ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వం, మీడియా కార్యాలయాల సమన్వయంతో జర్నలిస్టులు వార్తలు, కథనాలు రాయాలని తాలిబన్ల నుంచి మీడియా సంస్థలకు హెచ్చరికలు అందినట్టు అమెరికా పత్రిక పేర్కొంది.
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల పరమయ్యాక రోజువారీ వార్తలు కూడా ప్రచురించలేని పరిస్థితి దాపురించిందని, ఫలితంగా 150కిపైగా మీడియా సంస్థలు మూతపడ్డాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. పలు దినపత్రికలు ముద్రణను నిలిపివేసి ఆన్‌లైన్‌కే పరిమితమయ్యాయి.