శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (20:37 IST)

పాక్ మెలిక... సార్క్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం రద్దు

అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా జరగాల్సిన సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం రద్దయింది. ఈ భేటీ శనివారం జరగాల్సివుంది. తాలిబ్లన ఆధీనంలోని అఫ్గానిస్థాన్‌కు ఈ సమావేశంలో ప్రాతినిధ్యం కల్పించాలని పాక్‌ పట్టుబట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
అయితే ఈ ప్రతిపాదనపై భారత్‌ సహా మరికొన్ని దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సమావేశం రద్దయినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఐరాస సర్వసభ్య సమావేశాల్లో భాగంగా ఏటా ఈ సమావేశాలు జరుగుతాయి.
 
అమెరికాసేనల నిష్క్రమణతో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. భారత్ సహా చాలా దేశాలు ఆ ప్రభుత్వాన్ని ఇంకా గుర్తించలేదు. అలాగే కేబినెట్ మంత్రులుగా ఎంపికైన పలువురు తాలిబన్ నేతలు ఐరాస నిషేధిత జాబితాలో ఉన్నారు.
 
కాగా, సార్క్‌ అనేది దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం. భారత్‌, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్‌ ఇందులో సభ్య దేశాలు. మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 23 శాతం ఇక్కడే ఉంది. అయితే భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు సార్క్‌ సమావేశాలపై ప్రభావం చూపుతున్నాయి.