గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (09:44 IST)

భక్తులకు తితిదే నయా రూల్: వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతి

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇకపై కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారికే స్వామి దర్శనభాగ్యం లభించనుంది. 
 
వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ కానీ, దర్శనానికి మూడు రోజులు ముందు చేయించుకున్న కరోనా పరీక్ష నెగటివ్ సర్టిఫికెట్ కానీ ఉంటేనే దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. 
 
అలాగే, శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8 వేల టోకెన్లు విడుదల చేయనున్నట్టు చెప్పారు. 
 
సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా ఇస్తున్న టోకెన్లను నిలిపివేయనున్నారు. అలాగే, అక్టోబరు నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
 
తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు వీలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులోభాగంగా, కరోనా వైరస్ బాధితులు కొండపైకి రాకుండా ఉండేందుకే ఈ కొత్త నిబంధనను అమలు చేస్తున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.