సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (14:44 IST)

భగ్గుమన్న తమ్ముళ్ళు... రాజీనామాలు... బుజ్జగింపుల పర్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ టీడీపీలో పెను దుమారేన్నే రేపింది. ఒకరి తర్వాత ఒకరు అలకపాన్పు ఎక్కారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో మొదలైన ఈ రాజీనామాల పరంపర చింత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ టీడీపీలో పెను దుమారేన్నే రేపింది. ఒకరి తర్వాత ఒకరు అలకపాన్పు ఎక్కారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో మొదలైన ఈ రాజీనామాల పరంపర చింతమనేని ప్రభాకర్‌ వరకూ వచ్చింది. ఇంకా ఎంతమంది అధినేత నిర్ణయాన్ని ధిక్కరిస్తారో తెలియని పరిస్థితి. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడం ఈ తలనొప్పులకు సగం కారణమైంది. జిల్లాల్లో నెలకొన్న వర్గపోరు మరో ప్రధాన కారణం. తెలుగు తమ్ముళ్ల అసంతృప్తులు, అలకలు పెరిగిపోతున్నాయి. 
 
మరోవైపు... పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం నియోజకవర్గంలోనేకాకుండా జిల్లావ్యాప్తంగా జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిత వర్గీయులు మంత్రి పదవి దాదాపు ఖాయమైపోయిందన్న నమ్మకంతో రాజధాని అమరావతికి కూడా బయలుదేరి వెళ్లారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆమెకు మొండిచేయి చూపించారు. దీంతో ఆమెతో పాటు ఆమె అనుచరులంతా తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. 
 
అలాగే, ఏపీ మంత్రి వర్గ విస్తరణలో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు పదవి దక్కకపోవడంపై ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి నరేంద్ర రాజీనామా చేయాలంటూ వారు నినాదాలు చేశారు. 
 
కాగా, మంత్రి వర్గ విస్తరణలో తనకు పదవి దక్కక పోవడంపై అసంతృప్తితో ఉన్న నరేంద్ర, చింతలపూడి గ్రామంలోని స్వగృహంలో తన సన్నిహితులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి నరేంద్ర రాజీనామా చేయాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. నరేంద్రకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
 
దీంతో చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రి పదవిని కోల్పోయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు మూడు సార్లు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. విస్తరణకు కారణాలను, బొజ్జలను ఎందుకు తీసేయాల్సి వచ్చిందన్న అంశాలను వివరించి, రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కోరారు. పార్టీ పరిస్థితిని తాను అర్థం చేసుకున్నానని, తన పరిస్థితిని కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా బొజ్జల వ్యాఖ్యానించినట్టు సమాచారం.