వశిష్ఠ మహర్షి అరుంధతి పుణ్యదంపతులు.. కామధేనువు..!

Selvi| Last Updated: శనివారం, 29 నవంబరు 2014 (19:08 IST)
వశిష్ఠ మహర్షి, అరుంధతి లోకానికి ఆదర్శంగా నిలిచిన పుణ్యదంపతులైతే వారి వద్ద ఉండిన కామధేనువు సకలసంపదలను ప్రసాదిస్తుంది. వశిష్ఠ మహర్షి ఎంతటి తపోశక్తి సంపన్నుడో, పాతివ్రత్యంలో అరుంధతి అంతటి శక్తి సంపన్నురాలు. దైవారాధనలో వారి ఆశ్రమ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంటుంది.

వశిష్ఠ మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రుడు అసహనానికి లోనవుతాడు. అందుకోసం వశిష్ఠ మహర్షి ప్రయత్నాలను అడ్డుకోవడానికి నానాప్రయత్నాలు చేస్తుంటాడు. అయినా అవేవీ ఆయన తపోశక్తిముందు నిలవలేకపోతుంటాయి. దాంతో దేవేంద్రుడు ఆ ప్రాంతంలో కరవు కాటకాలను సృష్టిస్తాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలితో బాధలు పడుతుంటారు.

వాళ్ల ఆకలి బాధను చూడలేకపోయిన అరుంధతి, ఆ బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని అమ్మవారిని కోరుతుంది. ఈ క్రమంలో అమ్మవారు అరుంధతికి ఒక కామధేనువును ప్రసాదిస్తుంది. కావలసినవాటిని కోరుతూ ఆ కామధేనువును ప్రార్ధిస్తే అవి వెంటనే సమకూరతాయని ఆ తల్లి సెలవిస్తుంది.

సంతోషంతో అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకున్న అరుంధతి ... ఆ కామధేనువును ప్రార్ధించి ఆశ్రమంలోని అందరి ఆకలిని తీరుస్తుంది. ఉద్దేశ పూర్వకంగా తమని ఇబ్బందిపెట్టడం కోసం దేవేంద్రుడు సృష్టించిన కరవుకు, కామధేనువుతో అరుంధతి సమాధానం చెబుతుంది.దీనిపై మరింత చదవండి :