1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ప్రీతి
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (11:31 IST)

వేసవిలో ఇవి తినకపోతే.. ఎంతో మిస్సైనట్టే

ఎండాకాలం వచ్చిందంటే సూర్యుడి తాపం పక్కనపెడితే చాలా సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి. మామిడిపండ్లు, పుచ్చకాయ ఇలా చాలా రకాల పండ్లు అందరినీ పలకరిస్తాయి. పుచ్చకాయలు, మామిడిపండ్లు అన్ని ప్రాంతాల్లో విరివిగా దొరుకుతాయి కాబట్టి పట్టణాలు, ఇంకా నగరాల్లో ప్రజలు ఎండ వేడి నుండి ఉపశమనం పొందడానికి వీటినే ఎక్కువగా తింటుంటారు. కానీ ఎండాకాలంలో మాత్రమే దొరికేవి, ఒంటికి బాగా చలువ చేసేవి ఉన్నాయి. అవే తాటి ముంజలు. పల్లెలు, ఒక మోస్తరు పట్టణాల్లో ఇవి బాగా దొరుకుతాయి, కానీ నగరాల్లో ఇవి దొరకడం చాలా కష్టం. కానీ వీటిని ఇష్టపడేవారు ధర ఎంతైనా సరే కొనడానికి వెనుకాడరు.
 
ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, బి, సి, ఐరన్, జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపి, శరీరం శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా ముంజల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా కడుపు నిండిన భావన కనిపిస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు వీటిని తీసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
అంతేకాకుండా ముంజలలో శరీరానికి చలువ చేసే లక్షణాలు ఉండటం వలన ఎండాకాలంలో ఎక్కువగా ఎదురయ్యే అలసట, నీరసం, వడదెబ్బ వంటి సమస్యలు దరిచేరవు. ఇక అందం విషయంలో కూడా వీటికి ప్రాధాన్యత ఉంది. ముఖంపై వచ్చే మొటిమలను వీటిని తరచుగా తినడంతో నివారించవచ్చు. ఇక వేసవి ఎలాగూ వచ్చేసింది, మరి మిస్ కాకండి.