ఆయుర్వేదంలో గోంగూర... గోంగూర రసాన్ని అలా కలుపుకుని...
ఆంధ్రమాతగా పిలవబడే గోంగూర అంటే తెలుగువారిలో చాలామందికి అమితమైన ఇష్టం. గోంగూరను రోజూ తింటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. గోంగూరలో చాలా మూలిక గుణాలున్నాయి. గోంగూరతో మంచి రుచికరమైన కూరలు, పచ్చళ్లు చేసుకుని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గోంగూరను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. తరచూ గోంగూరను తినడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
1. కొందరు రేచీకటికితో ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు తరచూ గోంగూరను కూరలుగా చేసుకుని తినాలి. లేదంటే గోంగూర పచ్చడిని అయినా రోజూ తింటూ ఉండాలి. అలాగే గోంగూర పూలతో కూడా దీన్ని నివారించొచ్చు. ముందుగా గోంగూర పూలను బాగా దంచుకోవాలి. తర్వాత రసాన్ని తీసుకోవాలి. ఆ రసాన్ని కాస్త వడగట్టుకోవాలి. దాన్ని పాలలో కలిపి తీసుకుంటే రేచీకటి సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది.
2. తరుచుగా విరోచనాలకు గురయ్యే వారు కూడా గోంగూరతో మంచి ఫలితాన్ని పొందొచ్చు. గోంగూర నుంచి జిగురు తీసి దాన్ని నీటిలో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
3. కొందరి శరీరంలోకి ఎక్కువగా నీరు చేరి ఉంటుంది. అలాంటి వారు గోంగూరను పథ్యంగా తీసుకుంటే మంచిది. దీంతో ఒంటిలో ఉండే నీరంతా కూడా క్రమంగా తగ్గిపోతుంది.
4. గోంగూరలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఐరన్ కూడా ఎక్కువే ఉంటుంది. రక్త ప్రసరణను ఇది అదుపులో ఉంచగలదు. బ్లడ్‌లో ఇన్సులిన్‌ను ఎక్కువగా పెంచగల శక్తి గోంగూరకు ఉంటుంది.
5. షుగర్‌తో ఇబ్బందిపడేవారు తరచూ గోంగూరతో తయారుచేసిన ఆహారపదార్థాలు తింటే చాలా మంచిది. దీంతో షుగర్‌ను నియంత్రించొచ్చు.
6. గోంగూరలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. దీంతో కంటి సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. గోంగూరలో క్యాల్షియం కూడా బాగా ఉంటుంది. ఎముకలు బలంగా మారేందుకు గోంగూర బాగా ఉపయోగపడుతుంది.