బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 మే 2021 (09:50 IST)

నీళ్లు కలుషితం.. సుమారు 40 టన్నుల చేపలు మృత్యువాత

fish
లెబనాన్‌లోని లిటానీ నదిలో నీళ్లు కలుషితం కావడం వల్ల సుమారు 40 టన్నుల చేపలు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. లెబనాన్‌లో అతి పెద్ద నది అయిన లిటానీ కలుషితమవుతోందని ఎన్నో ఏళ్లుగా అక్కడి పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు, ఫ్యాక్టరీల వ్యర్థాలను నదిలోకి వదులుతుండటం వల్ల నీళ్లు పూర్తిగా కలుషితమైపోయాయి.
 
కొన్ని రోజుల కిందటి నుంచే చేపలు నదిపైన తేలడం ప్రారంభమైందని, కొన్ని టన్నుల కొద్దీ ఇలా మృత్యవాత పడటం చాలా బాధాకరమని స్థానిక పర్యావరణ కార్యకర్త అహ్మద్ అస్కర్ చెప్పారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 40 టన్నుల చేపలు మృత్యువాత పడటం అసాధారణమని అన్నారు. దీనిపై విచారణ జరిపి నది కలుషితం కావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
 
నదిలో చేపలు పూర్తిగా విషపూరితమయ్యాయని, వాటిలో వైరస్ ఉన్నందు వల్ల చేపల వేటకు వెళ్లొద్దని 2018లోనే మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్ గతేడాది బీరుట్‌లో జరిగిన పేలుడు కారణంగా మరింత కుంగిపోయింది. ఇప్పుడు పర్యావరణానికి సంబంధించిన సవాళ్లు కూడా ఆ దేశానికి ఎదురవుతున్నాయి.