బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (09:21 IST)

'గీత' దాటిన చైనా - భారత భూభాగంలోకి వచ్చిన డ్రాగన్ సైనికులు

భారత్ - చైనా దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. దీనికి కారణం చైనా సైనికులు హద్దుమీరిన చర్యల కారణంగా అలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. మరోవైపు, తాజాగా చైనా వాస్తవాధీన రేఖను దాటింది. భారత భూభాగంలోకి ఏకంగా 423 మీటర్ల మేర చైనా సైన్యం ముందుకు వచ్చినట్టు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. 
 
1960లో చైనా పేర్కొన్న సరిహద్దును దాటి మరీ ముందుకు వచ్చినట్టు ఆ చిత్రాల ద్వారా తెలుస్తోంది. గల్వాన్ ఘటనతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మంగళవారం భారత్ - చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇప్పటివరకు జరిగిన రెండు దఫాల చర్చలు చైనా వైపున ఉన్న మోల్డోలో జరగ్గా, నేటి చర్చలు భారత భూభాగంలోని చుల్‌షుల్‌లో జరగనున్నాయి.
 
కాగా, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు చైనానే కారణమని, తొలిసారి చర్చలు జరిగినప్పుడు గల్వాన్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఇరు దేశాల సైనికులు ఉండరాదన్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించడమే అందుకు కారణమని కేంద్రమంత్రి వీకే సింగ్‌ అన్నారు. చైనా సైనికులు అక్కడ నిర్మించిన గుడారం కాలి బూడిద కావడమే ఘర్షణకు కారణమైందన్నారు.