బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (10:37 IST)

పైలట్ తొడపై పాప... కాక్‌పిట్‌లో అమ్మాయితో ఫోటోకు ఫోజు

ప్రయాణికురాలిగా విమానం ఎక్కిన ఓ అమ్మాయికి పైలట్ అతి చనువు ఇచ్చాడు. ఆమెను ఏకంగా కాక్‌పిట్‌లోకి రమ్మని చెప్పి తొడపై కూర్చోబెట్టుకుని ఫోటోకు ఫోజులిచ్చాడు. ఇందుకు ఆ విమాన సిబ్బంది కూడా తమవంతు సహకారం అందించారు. ఈ విషయం బహిర్గతంకావడంతో పైలట్‌తో పాటు అతనికి సహకరించిన సిబ్బందిపై విమానయాన సంస్థ వేటువేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చైనాలోని గుయిలిన్ నుంచి యాంగ్జోకు జీటీ 1011 అనే విమాన సర్వీసు బయలుదేరింది. అయితే, విమానం నడిపే పైలట్, ప్రయాణికురాలిని కాక్ పిట్‌లోకి ఆహ్వానించాడు. ఆపై అక్కడామెను కూర్చోబెట్టి చిత్రాలు తీశాడు. 
 
తన చేతి వేళ్లను 'వీ' ఆకారంలో పెట్టి ఫొటోలు దిగిన ఆమె, తనకెంతో సంతోషంగా ఉందని, కెప్టెన్‌కు ధన్యవాదాలని చెబుతూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇవి వైరల్ కావడంతో ఎయిర్‌లైన్స్ యాజమాన్యానికి విషయం తెలిసింది. 
 
ఎయిర్‌లైన్స్ నిబంధనలకు విరుద్ధంగా సాధారణ ప్రయాణికులను కాక్ పిట్‌లోకి అనుమతించడంతో పాటు ఆమె చిత్రాలు తీయడం నేరమేనని చెబుతూ, అతన్ని విధుల నుంచి బహిష్కరించారు. ఆమెను లోపలికి పంపేందుకు సహకరించిన విమాన సిబ్బందిపైనా చర్యలు తీసుకున్నారు.