బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (18:26 IST)

ఆకాశమే హద్దుగా ముష్పికర్ రెచ్చిపోయాడు.. ఏం చేయగలం : రోహిత్ శర్మ

భారత్ - బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఢిల్లీలో జరిగిన ప్రారంభ ట్వంటీ20లో బంగ్లా కుర్రోళ్లు భారత్‌ను చిత్తు చేశారు. ముఖ్యంగా, బంగ్లా ఆటగాడు ముష్పికర్ రహీమ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా బంగ్లాదేశ్ చేతిలో భారత జట్టు తొలి ట్వంటి20 ఓటమిని చవిచూసింది. 
 
ఈ ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ, ఫీల్డింగ్‌ వైఫల్యం వల్లే తమ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందన్నారు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా సాధించిన స్కోరు స్పల్పమైందేమీ కాదని తెలిపాడు. మ్యాచ్‌ను గెలిచేందుకు వీలుండే లక్ష్యాన్నే బంగ్లాదేశ్ ముందుంచామని చెప్పుకొచ్చాడు.
 
బంగ్లా ఆటగాడు ముష్పికర్‌ రహీమ్‌ను అవుట్ చేసే అవకాశాలు తమకు రెండుసార్లు వచ్చినప్పటికీ వాటిని మిస్‌ చేసుకున్నామని రోహిత్ శర్మ తెలిపాడు. బ్యాటింగ్‌ చేస్తున్నప్పటి నుంచీ ఒత్తిడికి గురయ్యామని, జట్టులో అనుభవం లేని ఆటగాళ్లు కూడా ఉన్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రత్యర్థి జట్టు సద్వినియోగం చేసుకుందని చెప్పారు. అయితే, టీ20ల్లో యజ్వేంద్ర చహల్‌ మిడిల్‌ ఓవర్లలో బౌలింగ్‌తో ముఖ్య పాత్ర పోషిస్తాడని ప్రశంసించాడు.