గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..
ఒక విమానం గగనతలంలో ఉండగానే దాని రెక్కలోని ఓ భాగం ఊడిపోయి రోడ్డుపై పడిన ఘటన అమెరికాలో నార్త్ కరోలినాలో చోటుచేసుకొంది. ఈ విషయాన్ని అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మిన్‌స్ట్రేషన్ కూడా ధ్రువీకరించింది. మంగళవారం రాత్రి హార్ట్స్‌ఫీల్డ్- జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నుంచి డెల్టా ఫ్లైట్ నెంబర్ 3247 బోయింగ్ 737-900 విమానం నార్త్ కరోలీనాలోని రెలీ-డర్హం ఎయిర్ పోర్టుకు బయల్దేరింది. ఈ విమానం ప్రయాణం మొత్తం సాఫీగానే సాగింది.
కానీ, రెలీ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో అత్యంత కీలకమైన విమానం రెక్కలోని ఫ్లాప్‌కు సంబంధించిన విడిభాగం ఊడిపోయింది. ఇది కింద ఉన్న రోడ్డు మార్గంపై పడింది. అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో 109 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది దానిలో ఉన్నారు.
ఎయిర్ పోర్టులో సదరు విమానం ఎడమ రెక్క వెనుక ఫ్లాప్‌లో కొంత భాగం కనిపించలేదు. పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించగా.. ప్రయాణం సమయంలోనే ఆ భాగం ఊడిపోయి మార్గం మధ్యలో పడిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ ఎఫ్ఏఏకు సమాచారం అందించింది.
దీనిపై బుధవారం ఎఫ్ఏఏ స్పందిస్తూ.. రెలీలోని ఓ మోటార్‌వేలో వింగ్ ఫ్లాప్లోని విడిభాగం దొరికిందని ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై డెల్టా ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు.
ఫ్లాప్స్ అనేవి విమానం రెక్క వెనకభాగంలో ఉంటాయి. వీటిని కదిలించే అవకాశం ఉంటుంది. ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో విమానం లిఫ్ట్, డ్రాగ్‌ను నియంత్రించడానికి వీటిని వినియోగిస్తారు. వీటి నియంత్రణలు పైలట్ చేతిలో ఉంటాయి.
ఇటీవలకాలంలో బోయింగ్ విమానాల్లో భద్రతా లోపాలు తరచూ బయటపడుతున్నాయి. వీటిని దృష్టిలోపెట్టుకొని బోయింగ్‌పై న్యాయస్థానంలో కేసులు వేసిన సంస్థలో పనిచేసే న్యాయవాదికి చెందిన బీచ్ హౌస్ ఎదుటే డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ఫ్లాప్ పడిపోవడం కొసమెరుపు. ఫ్లాప్ ఊడిపడిన ఘటనలోఎవరూ గాయపడలేదు.