అమ్మో భూకంపం: ఉత్తరాదినే కాకుండా.. దాయాది దేశంలోనూ..?
కరోనాతో ఇప్పటికే ప్రపంచ దేశాల వణుకుతున్న తరుణంలో.. భారత దేశంలో ఉత్తరాదిన, దాయాది దేశమైన పాకిస్థాన్‌లోనూ భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. తజికిస్థాన్, భారతదేశాల్లో సంభవించిన భూకంపం పాకిస్థాన్ దేశాన్ని కూడా వణికించింది. పాకిస్థాన్ దేశంలో శుక్రవారం రాత్రి 10.02 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని పాక్ మెట్రోలాజికల్ డిపార్టుమెంట్ వెల్లడించింది.
పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్,పంజాబ్, ఫక్తూన్ ఖవా, బలోచిస్థాన్ ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల పలు ఇళ్లు ఊగిపోయాయి. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వెల్లడించింది.
భూప్రకంపనలతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. 80 కిలోమీటర్ల లోతులో నుంచి సంభవించిన భూకంపం అనంతరం పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.