గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (17:36 IST)

మార్క్ జుకర్‌బర్గ్‌కు మరణశిక్షనా? రక్షించండి మహాప్రభో అంటున్న మెటా సీఈవో

mark zuckerberg
తనకు మరణశిక్ష పడే అవకాశం ఉందని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకెర్‌బర్గ్ వాపోతున్నారు. ఈ కేసు నుంచి తనను రక్షించాలని ఆయన అమెరికా పాలకులను ప్రాధేయపడుతున్నారు. ఎవరో ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు కారణంగా పాకిస్థాన్ దేశంలో తనకు మరణశిక్ష విధించాలని చూస్తున్నారని మెటా సీఈవో వాపోతున్నారు. ఇటీవల జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానిస్తూ, పాకిస్థాన్ దేశంలో తనపై నమోదైన కేసు ప్రస్తావించారు. 
 
"వివిధ దేశాల్లో మనం అంగీకరించని చాలా చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు.. పాకిస్థాన్‌లో నాకు మరణశిక్ష విధించాలంటూ ఎవరో దావా వేశారు. ఎవరో ఫేస్‌బుక్‌లో దేవుడుని అవమానిస్తూ ఉన్న చిత్రాలను పోస్ట్ చేయడమే దీనికి కారణం. ఇది ఎక్కడివరకు వెళుతుందో తెలియదు. నాకు ఆ దేశానికి వెళ్లాలని లేదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. 
 
భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు వివిధ దేశాల్లో పాటించే సాంస్కృతిక విలువలపై నింబంధనలు ఉన్నాయి. దీంతో యాప్‌లోని చాలా కంటెంట్‌ను అణచివేయాల్సి వుంది. ఆయా దేశాల ప్రభుత్వాలు సైతం మమ్మల్ని జైలులో పడేసేంత శక్తివంతంగా ఆ నిబంధనలు ఉంటాయి. విదేశాలలో ఉన్న అమెరికా టెక్ కంపెనీలను రక్షించడంలో అమెరికా ప్రభుత్వం సాయం అందించాలని భావిస్తున్నా" అని పేర్కొన్నారు. 
 
కాగా, గత యేడాది ప్రారంభంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఎక్స్, ఫేస్‌బుక్ వంటి పలు సామాజిక మాధ్యమాలపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెల్సిందే.