సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (14:11 IST)

ఇమ్రాన్ ఖాన్‌కు దేశాన్ని పాలించడం రాదు : సుప్రీంకోర్టు

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌కు దేశాన్ని పాలించడం రావడంలేదని ఆక్షేపించింది. దేశాన్ని పాలించే పద్ధతి ఇది కాదంటూ మండిపడింది. 
 
గత రెండు నెలలుగా కామన్ ఇంటరెస్ట్ కౌన్సిల్ (సీసీఐ) సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇద్దరు సభ్యుల బెంచ్‌కు జస్టిస్ ఖాజీ ఫేజ్ ఇసా నాయకత్వం వహించారు.
 
దేశాన్ని నడిపించడానికి జనాభా గణన ప్రాథమిక అవసరమని నొక్కిచెప్పిన జస్టిస్ ఇసా.. ‘జనాభా లెక్కల ఫలితాలను విడుదల చేయడం ప్రభుత్వ ప్రాధాన్యం కాదా? మూడు ప్రావిన్సులలో ప్రభుత్వం ఉన్నప్పటికీ, మండలిలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు? ఈ ప్రభుత్వానికి దేశాన్ని నడిపించే సామర్థ్యం లేదు. లేదా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నది’ అని అన్నారు. 
 
సీసీఐ నివేదికను ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. మంచి పనులను రహస్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటి? ఇలా చేయడం మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది" అని ఆయన అన్నారు.