ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (15:53 IST)

భారత ప్రధాని మోడీని వేనోళ్ళ పొగిడిన పాక్ ఎంపీలు.. ఎందుకు.. ఎక్కడ?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పాకిస్థాన్ ఎంపీలు, ముఖ్యంగా బలూచిస్థాన్ ఎంపీలు వేనోళ్ల పొగిడారు. మోడీ జిందాబాద్ అంటూ పాక్ ఎంపీలు నినాదాలు చేయడాన్ని జీర్ణించుకోలేని పాక్ విదేశాంగ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి నష్క్రమించించారు. ఇంతకీ ఈ సంఘటన జరిగిందన్నదే కదా మీ సందేహం.. సాక్షాత్ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలోనే జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ పార్లమెంట్‌లో బలూచిస్థాన్ ఉద్యమం గురించి ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ సభలో ప్రసంగం మొదలుపెట్టారు. ఆ సమయంలో బలూచిస్థాన్ ఎంపీలు అడ్డుతగిలారు. వారు సభాముఖంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని వేనోళ్ల పొగుడుతూ పాక్ విదేశాంగ మంత్రిని తీవ్ర అసహనానికి గురిచేశారు. ఆ ఎంపీలు ఎంతకీ తగ్గకుండా మోడీ, మోడీ అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో ఖురేషీ ఉడికిపోయారు. ఊగిపోయారు. 
 
బలూచిస్థాన్ ఎంపీల మనసుల్లోకి మోడీ భావనలు చొరబడినట్టున్నాయని, భారత అజెండాను విపక్ష సభ్యులు పాక్‌లో అమ్ముతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత అనుకూల నినాదాలతో జాతీయ సంస్థలను అవమానానికి గురిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. 
 
విపక్ష సభ్యుల నియోజకవర్గాల నుంచి బలూచిస్థాన్ స్వాతంత్ర్యం కోసం నినాదాలు రావడం సిగ్గుచేటు అని అన్నారు. అయినప్పటికీ బలూచిస్థాన్ ఎంపీలు ఖురేషీకి పదేపదే అడ్డుతగిలారు. దాంతో ఖురేషి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు.
 
అంతకుముందు, పాకిస్థాన్ పార్లమెంటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వైఖరిని ఖండిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఓ తీర్మానం ఆమోదించింది. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా చార్లీ హెబ్డో పత్రికలో వ్యంగ్య చిత్రణ చోటుచేసుకోవడాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఖండించకపోవడాన్ని నిరసిస్తూ పాక్ పార్లమెంటులో తీర్మానం చేశారు. 
 
ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ప్రసంగిస్తూ, మధ్యలో బలూచిస్థాన్ ప్రస్తావన తీసుకువచ్చారు. దాంతో బలూచిస్థాన్ ప్రాంత ఎంపీలు రెచ్చిపోయి మంత్రి ప్రసంగాన్ని రసాభాస చేశారు.