సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (11:12 IST)

మానవతామూర్తికి మహా గౌరవం ... మదర్‌ థెరిసాకు నేడు 'సెయింట్‌హుడ్' హోదా

మానవతా మూర్తి మదర్‌ థెరిసాకు సెయింట్ హుడ్ (పునీత) హోదా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం వాటికన్‌ నగరంలో మతగురువుల జాబితాలో చేర్చే ఉత్సవంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ థెరిసాకు ‘సెయింట్‌’ హోదా ప్రకటించనున

మానవతా మూర్తి మదర్‌ థెరిసాకు సెయింట్ హుడ్ (పునీత) హోదా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం వాటికన్‌ నగరంలో మతగురువుల జాబితాలో చేర్చే ఉత్సవంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ థెరిసాకు ‘సెయింట్‌’ హోదా ప్రకటించనున్నారు. లక్షలమంది థెరిసా అభిమానుల సమక్షంలో ప్రకటన జరుగనుంది. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌ నుంచి దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ నేతృత్వంలోని 12 మంది సభ్యుల కేంద్ర ప్రతినిధి బృందం హాజరుకానుంది. వీరితో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీల ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ స్థాయి ప్రతినిధి బృందాలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
 
థెరిసా స్థాపించిన 'మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ' సుపీరియర్‌ జనరల్‌ సిస్టర్‌ మేరీ ప్రేమ ఆధ్వర్యంలో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన 40-50 మంది నన్స్‌ కూడా పాల్గొననున్నారు. కోల్‌కతా ఆర్చిబిషప్‌ థామస్‌ డిసౌజాతోపాటు 45 మంది దాకా బిషప్‌లు ఇప్పటికే వాటికన్‌లో ఉన్నారు. కోల్‌కతా నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. కోల్‌కతా వీధుల్లో 45 సంవత్సరాలపాటు పేదలు, రోగుల సేవలో నిమగ్నమైన మదర్‌ థెరిసాకు పునీత హోదా ఇవ్వనున్నట్లు మార్చిలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రకటించారు. 
 
మదర్‌థెరిసా మహాప్రస్థానం.. 
జననం: 1910, ఆగస్టు 26, మాసిడోనియా స్కోప్జేలో జననం. పేరు.. ఆగ్నెస్‌ గోన్‌క్సా బోజాక్సియు.
మరణం: 1997, సెప్టెంబరు 5. కోల్‌కతాలో
జన్మదినం: బాప్టిజం స్వీకరించిన ఆగస్టు 27. 
మతప్రస్థానం: ఐర్లాండ్‌లోని సిస్టర్స్‌ ఆఫ్‌ లోరెటో అనే క్యాథలిక్‌ వ్యవస్థలో చేరేందుకు 18 ఏళ్ల వయసులో ఇంటిని వదిలి వెళ్లారు. 1929లో భారత్‌కు వచ్చారు. పేరు థెరిసాగా మార్పు
ఉపాధ్యాయురాలు: 1931 నుంచి 1948 వరకు కోల్‌కతాలోని సెయింట్‌ మేరీస్‌ ఉన్నత పాఠశాలలో సిస్టర్‌ థెరిసా బోధన సేవలందించారు.
మలుపు: 1946, సెప్టెంబరు 10న 'దైవపిలుపు'ను అందుకొని కోల్‌కతా మురికివాడలకు చేరారు. అక్కడి ప్రజలు ఆమెను పూజ్యభావంతో 'మదర్‌' థెరిసాగా పిలుచుకున్నారు.
 
కొత్త వ్యవస్థ: 1950, అక్టోబరు 7న ‘మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ’ ఏర్పాటుకు క్యాథలిక్‌ చర్చి అనుమతి పొందారు.
గుర్తింపు: 1979లో నోబెల్‌ శాంతి బహుమతి. 1980లో భారతరత్న. 1971లో 23వ పోప్‌జాన్‌ శాంతి బహుమతి. 1969లో నెహ్రూ పురస్కారం. 1978లో బల్జాన్‌ పురస్కారం. 1973లో టెంపుల్టన్‌ పురస్కారం. 1962లో మెగాసెసే అవార్డు.
కీలకఘట్టం: సెయింట్‌ హోదా పొందేందుకు ముందస్తు అడుగైన 'బీటిఫికేషన్' ప్రక్రియను 2003లో రెండో పోప్‌ జాన్‌పాల్‌ పూర్తిచేశారు.
తుదిఘట్టం: 2016, సెప్టెంబరు 4న మదర్‌ థెరిసాకు క్యాథలిక్‌ చర్చి పునీత హోదా ప్రకటన.