ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం

ఐరాసలో నిధుల లేమి

ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఖజానా ఈ నెలాఖరుకు నిండుకోబోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. 230 మిలియన్ డాలర్ల లోటుతో నడుస్తున్న ఐరాస, ప్రస్తుతం సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేనట్లు తెలుస్తోంది.

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ దాదాపు 37 వేల మంది ఉద్యోగులను ఉద్దేశించి రాసిన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జీతభత్యాలను చెల్లించేందుకు అదనపు చర్యలు తీసుకోవలసి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐరాస లోటు 230 మిలియన్ డాలర్లని తెలిపారు.

ఈ నెలఖరుకు ఐరాస ఖజానా ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోందన్నారు. 2019లో అవసరమైన నిధులలో 70 శాతం మాత్రమే సభ్య దేశాలు ఇచ్చాయన్నారు. దీనివల్ల సెప్టెంబరు చివరినాటికి 230 మిలియన్ డాలర్ల లోటు ఏర్పడిందని వివరించారు.

అక్టోబరు చివరినాటికి రిజర్వు నిధులు కూడా ఖర్చయిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అధికారిక పర్యటనలను తగ్గించుకోవడం, ఇంధన పొదుపు, సమావేశాల వాయిదా వంటి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడటానికి సభ్య దేశాలు బాధ్యత తీసుకోవాలని కోరారు.