శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (16:37 IST)

జపాన్ పైకి ఉత్తర కొరియా క్షిపణులు

కరోనా వైరస్‌ వ్యాప్తి భయం ప్రపంచాన్ని కమ్ముకుని, తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న వేళ, ఉత్తర కొరియా మాత్రం ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తూ కవ్వింపు చర్యలకు దిగింది. వోన్సాన్‌ పట్టణం నుంచి సీ ఆఫ్‌ జపాన్‌ పై క్షిపణులను ప్రయోగించింది. సూపర్‌ లార్జ్‌ మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్లను కూడా కిమ్ సేన పరిశీలించినట్టు తెలుస్తోంది.
 
జపాన్‌, కొరియా, రష్యాల సరిహద్దులో ఉన్న ద్వీపం లక్ష్యంగా ఆదివారం ఈ రాకెట్ లాంచర్లు ప్రయోగం జరిగిందని సమాచారం. క్షిపణి ప్రయోగాలు ఎప్పుడు జరిగినా, హాజరై, వాటిని ప్రత్యక్షంగా తిలకించే దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈదఫా మాత్రం రాలేదని స్థానిక మీడియా వెల్లడించింది. ఆయన బదులుగా, అధికార పార్టీ ఉపాధ్యక్షుడు రీ ప్యాంగ్‌ చోల్‌ ప్రయోగాలను పర్యవేక్షించారని పేర్కొంది.
 
కాగా, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మండిపడ్డారు. కరోనాపై ప్రపంచమంతా పోరాడుతున్న వేళ, ఉత్తర కొరియా ఇలా ప్రవర్తించడం అనుచితమైన చర్యని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించిందని ఆయన ఆరోపించారు. క్షిపణి ప్రయోగాలను అమెరికా ఇంటలెజిన్స్‌ వర్గాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయని తెలిపారు.
 
కాగా, ఈ పరీక్షల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కూడా తెలుసునని అమెరికా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. జపాన్ ప్రత్యేక ఎకనామిక్‌ జోన్‌ కు అతి దగ్గరలోనే క్షిపణులు ల్యాండ్‌ అయ్యాయని గుర్తించామని అన్నారు.