యునైటెడ్ ఎయిర్లైన్స్ ఓవరాక్షన్.. నోట్లో రక్తం కారుతున్నా లాక్కెళ్లారు.. విమానం నుంచి దించేశారు.. (వీడియో)
యునైటెడ్ ఎయిర్లైన్స్ ఓవరాక్షన్ చేసింది. గతంలో ఇద్దరు అమ్మాయిలు లెగ్గింగ్స్ వేసుకున్నారని విమానం ఎక్కనివ్వని సదరు సంస్థ.. ఆసియాకు చెందినట్లు కనిపించే వ్యక్తిని విమానం నుంచి బలవంతంగా లాక్కెళ్లి బయటికి
యునైటెడ్ ఎయిర్లైన్స్ ఓవరాక్షన్ చేసింది. గతంలో ఇద్దరు అమ్మాయిలు లెగ్గింగ్స్ వేసుకున్నారని విమానం ఎక్కనివ్వని సదరు సంస్థ.. ఆసియాకు చెందినట్లు కనిపించే వ్యక్తిని విమానం నుంచి బలవంతంగా లాక్కెళ్లి బయటికి నెట్టేసింది. షికాగో నుంచి లూయీస్విల్లే వెళ్లాల్సిన యునైటెడ్ ఫ్లైట్ 3411లో పరిమితి కంటే ఎక్కువ టెక్కెట్లు బుక్కయ్యాయి. దీంతో విమాన సిబ్బంది కొందరిని విమానం నుంచి కిందకు దించేశారు.
కానీ ఆసియాకు చెందినట్లుగా కనిపిస్తున్న ఓ వ్యక్తి మాత్రం విమానం దిగేందుకు నిరాకరించడంతో సెక్యురిటీ సిబ్బంది విమానంలోకి వచ్చి బలవంతంగా అతడిని లాక్కుపోయారు. చేతులు, కాళ్లు పట్టుకుని.. చొక్కా పైకి పోయినా, నోట్లో నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా చాలా దురుసుగా ప్రవర్తించారు. దీంతో తోటి ప్రయాణీకులు ఎయిర్లైన్స్ సెక్యూరిటీ ప్రవర్తన చూసి షాక్ అయ్యారు.
ఈ ఘటనను వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది. యునైటెడ్ ఎయిర్లైన్స్ సిబ్బంది తీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంత జరిగినా ఎయిర్లైన్స్ సీఈఓ ప్రయాణీకుడికి సారీ చెప్పలేదు. సదరు ప్రయాణీకుడు సెక్యూరిటీ సూచనలు పాటించలేదని.. విమానం దిగేందుకు వెయ్యి డాలర్ల పరిహారం ఇస్తామన్నా.. అంగీకరించకపోవడంతోనే సెక్యూరిటీ రంగంలోకి దిగిందని ఎయిర్లైన్స్ వివరణ ఇస్తోంది.
ఘటనకు సంబంధించి వీడియోను టైలర్ బ్రిడ్జెస్ అనే వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బలవంతంగా దించేసిన ప్రయాణికుడు తాను వైద్యుడినని.. రోగుల కోసం తాను కచ్చితంగా లూయీస్విల్లే వెళ్లాల్సి ఉందని యునైటెడ్ ఎయిర్లైన్స్ సిబ్బందితో చెప్పినా వారు బలవంతంగా దించేశారని బ్రెడ్జెస్ ఆ పోస్టులో చెప్పారు.