బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (10:56 IST)

విదేశాలకు వెళ్లాలంటే వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు తప్పనిసరి..!

ప్రపంచ దేశాలను కల్లోలపరిచిన కరోనా నేపథ్యంలో ఈ 'వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్టు' అంశం తెరపైకి వచ్చింది. 'మేము కరోనాతో బాధపడటం లేదు', 'కరోనా టీకా తీసుకున్నాం' అని ధ్రువపరిచే అధికారిక పత్రాన్నే 'వ్యాక్సిన్‌ పాస్‌పోర్టుగా పిలుస్తున్నారు.

ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లాలనుకునే వారికి భవిష్యత్తులో ఈ వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు తప్పనిసరి కావొచ్చు. ఇప్పటికే ఈ సేవలను ఇజ్రాయెల్‌, చైనా ప్రారంభించాయి. దీంతో ఇండియాలో కూడా తప్పనిసరి చేసేందుకు కసరత్తు జరుగుతుంది.
 
కరోనా కారణంగా ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్‌ పాస్‌పోర్టుకు అప్లై చేసుకోవాలని అంతర్జాతీయ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ సంస్థ 'ఐఎటిఎ ట్రావెల్‌ పాస్‌' పేరిట వాక్సిన్‌ పాస్‌పోర్టు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు ప్రయాణికులు స్పందన వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆరోగ్యసేతు యాప్‌ను కూడా డౌన్‌లోడు చేసుకోవాలని నిబంధనలు ఉన్నాయి.
 
వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు అంటే?
'వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు' అనేది కాగితపు రహిత డాక్యుమెంటు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. 'వైద్య పరీక్షల్లో మీకు కరోనా లేదని' (లేదా టీకా వేయించుకున్న వివరాలు) పేర్కొంటూ ప్రభుత్వం జారీచేసిన ధ్రువపత్రాన్ని 'వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు' సేవలకు ఉద్దేశించిన గుర్తింపు పొందిన యాప్‌లలో నమోదు చేస్తే డిజిటల్‌ 'వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు'ను జారీ చేస్తారు.

వాస్తవానికి 'వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు' అనే కాన్సెప్ట్‌ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. 2016-17లో ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలను 'యెల్లో ఫీవర్‌' కల్లోలపరిచింది. ఆ వ్యాధి బారి నుంచి బయటపడేందుకు ఆఫ్రికా, దక్షిణ అమెరికాకు చెందిన వేలాది మంది ప్రజలు అమెరికా, భారత్‌ వంటి దేశాలకు వచ్చారు.

అయితే, 'యెల్లో ఫీవర్‌' సోకలేదని లేదా ఆ వ్యాధికి వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు రుజువుచేసే పత్రాలు (ఒక విధంగా వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్టు) ఉన్న వారినే అమెరికా, భారత్‌ అప్పుడు అనుమతించాయి. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితే రావడంతో వివిధ దేశాల విమానయాన సంస్థల సేవలను పర్యవేక్షించే 'ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అసోసియేషన్‌' సంస్థ ఈ యాప్‌ను తీసుకొచ్చింది.

పేద, మధ్యతరగతి దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్‌ పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం ఈ యాప్‌ను పరిశీలనలో ఉంచింది. కాగా 'కామన్‌ పాస్‌', 'డిజిటల్‌ హెల్త్‌ పాస్‌' పేరిట మరికొన్ని యాప్స్‌ కూడా ఈ సేవలు అందిస్తున్నట్లు సమాచారం.