బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (21:00 IST)

విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించండి: ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

కరోనా వైరస్ పై శుక్రవారం విజయవాడ రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ నుండి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు తో వీడియో సమావేశం నిర్వహించారు.
 
వీడియో సమావేశంలో డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరినీ త్వరితగతిన గుర్తించి వారిని 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉంచాలని ఆదేశించారు. అంతేగాక పట్టణ ప్రాంతాల్లో అలాంటి వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఆసుపత్రులు సన్నద్ధం చేయాల్సిన అంశాలపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
 
సమావేశంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ.. నిత్యావసర సరుకుల సరఫరాకు సంబంధించి రైతు బజారులను 220కు పెంచడం జరిగిందని పట్టణాల్లో మొబైల్ రైతు బజారులను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.

అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ల తోడ్పాటుతో ఇంటింటా సరుకుల సరఫరాకు కూడా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు.నిత్యావసర సరుకులు లభ్యతకు సంబంధించి రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ కు ఇప్పటి వరకూ 1902 కంట్రోల్ రూమ్ కు 546 ఫోన్ కాల్స్ రాగా వాటిలో అత్యధికంగా నిత్యావసర సరుకుల లభ్యత, రవాణాకు సంబంధించినవే ఉన్నాయని తెలిపారు.

నిత్యావసర సరుకులు లభ్యత,రవాణా,ధరలకు సంబంధించిన అంశాలను జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు మానిటర్ చేయాలని చెప్పారు.

మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ జిఎస్ఆర్కె విజయకుమార్ మాట్లాడుతూ.. డిస్ ఇన్ఫెక్షన్ మెటీరియల్, బ్లీచింగ్ పౌడర్ వివిధ కంపెనీల నుంచి వివిధ జిల్లాలకు పంపడం జరుగుతోందని వాటిని రవాణా చేసే వాహనాలకు ఆటంకం లేకుండా చూడాలని కోరారు.
 
ఈ కంట్రోల్ రూమ్ నుండి వీడియో సమావేశంలో ఉన్నతాధికారులు కార్తికేయ మిశ్రా,కన్న బాబు తదీతరులు, సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఆశాఖ కమిషనర్ జిఎస్ఆర్కె విజయకుమార్, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై మధుసూధన్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .