మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2019 (07:24 IST)

మళ్లీ విదేశాలకు రాహుల్

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ విదేశాలకు వెళ్లారు. సోమవారంనాడు ఆయన విదేశాలకు వెళ్లారని, వారం రోజుల పర్యటన ముగించుకుని నవంబర్ మొదటి వారంలో తిరిగి వస్తారని, ఆ వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ చేపట్టే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్న తరుణంలో రాహుల్ విదేశీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబర్ మొదటి వారంలో హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనూ రాహుల్ విదేశాలకు వెళ్లారు. 

నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకూ కాంగ్రెస్ పార్టీ 35 మీడియా సమావేశాలు నిర్వహించనుంది. దేశ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరిస్తూ నవంబర్ 5 నుంచి 15 వరకూ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి వరకూ జరిపే మీడియా సమావేశాల్లో పార్టీ సీనియర్ నేతలు మాట్లాడనున్నారు.

అలాగే, ఢిల్లీలో భారీ ప్రదర్శనను కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఈ ప్రదర్శనకు విపక్షాలను కూడా ఆహ్వానించనున్నారు. జిల్లాల్లోనూ, రాష్ట్ర రాజధానుల్లోనూ నిరసనలు నిర్వహించి, చివరిగా దేశరాజధానిలో జరిగే భారీ ప్రదర్శనతో వీటిని ముగిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈనెల 23న ఒక ప్రకటనలో తెలిపారు.