ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 అక్టోబరు 2019 (15:49 IST)

డ్రగ్ ఎడిక్ట్ టెక్కీ, కాలేజ్ నుంచి డిబార్, తల్లిదండ్రులు లేనప్పుడు ఇంటర్ చదివే సోదరిని...

డ్రగ్స్. మాదక ద్రవ్యాలు ఎందరో జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా అప్పుడే టీనేజ్ వయసులో అడుగుపెట్టిన యువతలో కొందరు పెడదోవ పడుతున్నారు. మోడ్రన్ లైఫ్ అంటూ పబ్‌లు, బీచ్‌లు అంటూ తిరగడమే కాకుండా అక్కడే పొంచి వున్న డ్రగ్స్ ముఠా వలలో పడిపోతున్నారు. అలా మత్తు మందుకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. 
 
తాజాగా మంగుళూరులో ఇంజినీరింగ్ చదివే శాంసంగ్ అనే యువకుడు మత్తులో చిత్తు అవడమే కాకుండా తన సొంత చెల్లెల్ని అతి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాలను చూస్తే... శాంసన్ మంగుళూరులో పేరుమోసిన కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఐతే డ్రగ్స్‌కి బానిసై క్లాసులకు వెళ్లడం మానేయడం మొదలుపెట్టాడు. దీనితో అతడిని కాలేజీ యాజమాన్యం డీబార్ చేసేసింది. కన్నకొడుకు చదువుకుని ఉన్నతంగా వుండాలనుకున్న ఆ తల్లిదండ్రులు ఈ వార్త విని ఆవేదన చెందారు.
 
డ్రగ్స్ ఎడిక్ట్ అయిన అతడిని ఏ కౌన్సిలింగ్ సెంటరుకో తరలించకుండా ఇంట్లోనే వుంచేశారు. ఇంట్లో వున్న శాంసన్ పొద్దస్తమానం సెల్ ఫోన్ చూస్తూ కాలం గడుపుతుండటంతో అతడు మరింత పాడవుతాడని ఆ సెల్ ఫోనును అతడి వద్ద నుంచి తీసేసుకున్నారు. మరోవైపు దసరా శెలవులకి ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల ఫియోనా ఈ నెల 6న ఇంటికి వచ్చింది. ఫియోనా రాగానే తన కొడుకు నుంచి తీసుకున్న సెల్ ఫోనుని ఆమెకి ఇచ్చారు పేరెంట్స్.
 
అక్టోబరు 8న పండుగ రోజున పిల్లలకి స్వీట్లు తీసుకువద్దామని శాంసన్ తండ్రి బజారుకు వెళ్లాడు. తల్లి ఉద్యోగానికి వెళ్లింది. ఈ సమయంలో ఇంట్లో శాంసన్, అతడి సోదరి ఫియోనా మాత్రమే వున్నారు. తన తండ్రి ఫియోనాకిచ్చిన సెల్ ఫోనును తిరిగి తనకివ్వాలంటూ సోదరితో గొడవపడ్డాడు శాంసన్. ఐతే ఆమె అందుకు ససేమిరా అంది. దీనితో ఆగ్రహం చెందిన శాంసన్ ఇంట్లో వున్న సుత్తిని తెచ్చి చెల్లి తలపై బలంగా మోదాడు. దాంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ఆమె చనిపోయిందనుకున్న శాంసన్ ఆమెను తమ ఇంటికి సమీపంలో వున్న ముళ్ల పొదల్లో విసిరేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు.
 
స్వీట్లు తెచ్చిన తండ్రి, కుమార్తె ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె గురించి వాకబు చేశాడు. ఆమె ఊరికి వెళ్లిపోయిందని చెప్పాడు శాంసన్. దీనితో కుమార్తె సెల్ ఫోనుకి ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆందోళన చెందిన అతడి తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె సెల్ ఫోన్ లాస్ట్ సిగ్నల్ ట్రేస్ చేసి చూడగా అది మృతురాలి ఇంట్లోనే చూపించింది. దీనితో పోలీసులు శాంసన్ పైన అనుమానపడ్డారు.

తొలుత అతడు తనకేమీ తెలియదని బుకాయించాడు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసేసరికి జరిగినదంతా చెప్పేశాడు. కన్న కొడుకే కుమార్తెను కడతేర్చాడని తెలిసి ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. పోలీసులు ఫియోనా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శాంసన్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.