సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (10:07 IST)

ప్రకాశంలో కులోన్మాదం : ఎస్సీ కులస్తుడిని ప్రేమించిందనీ పీక పిసికి చంపేశాడు...

ప్రకాశం జిల్లాలో కులోన్మాదం బుసలు కొటచ్టింది. ఫలితంగా మరో పరువు హత్య జరిగింది. ఎస్సీ కులానికి చెందిన యువకుడుని ప్రేమించిందన్న అక్కసుతో కన్న కూతుర్ని కన్నతండ్రి కడతేర్చాడు. పీకపిసికి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రకాశం జిల్లాలో తాళ్లూరు మండలం కొత్తపాలెంకు చెందిన కోట వెంకట రెడ్డి అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో రెండో కుమార్తె వైష్ణవి (20) ఒంగోలులోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.
 
ఇదే కాలేజీలో లింగసముద్రంకు చెందిన ఎస్సీ కులస్థుడైన సునీల్‌ అనే సహ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. అది వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ఈ విషయం వైష్ణవి తండ్రికి తెలియడంతో కుమార్తెను మందలించాడు. దీంతో ఆమె గతనెల 31వ తేదీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. 
 
ఆ తర్వాత తల్లిడండ్రులు కళాశాల యాజమాన్యం సాయంతో సునీల్‌ను గుర్తించి.. అతని ద్వారా ఆమె తిరుపతిలో ఉందని తెలుసుకున్నారు. సునీల్‌తో ఆమెకు ఫోన్‌ చేయించి ఇంటికి తీసుకొచ్చారు. ఆమె ఈనెల 2న మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో వైష్ణవి మార్కాపురంలో ఉందని పోలీసుల ద్వారా సమాచారం అందుకొన్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.
 
అర్థరాత్రి పూటే ఆమె మళ్లీ ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, తండ్రి అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. దీంతో ఆగ్రహానికి గురైన వెంకటరెడ్డి కుమార్తె గొంతు నులిమి చంపేశాడు. గ్రామస్థులకు తన కుమార్తె నాలుగు రోజులుగా అన్నం తినడం లేదని దీంతో నీరసించి చనిపోయిందని నమ్మబలికాడు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వెంకటరెడ్డిని విచారించగా తానే చంపినట్లు అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసి వెంకటరెడ్డిని అరెస్టు చేశారు.