గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (11:53 IST)

బంగారు ఆభరణాలను మింగేసిన ఎద్దు... పేడలోనైనా వస్తాయనీ...

హర్యానా రాష్ట్రంలోని సిర్సాలో ఓ విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ ఎద్దు బంగారు ఆభరణాలను మింగేసింది. ఈ విషయం తెలుసుకున్న గృహిణి ఆ ఎద్దు వేసే పేడలోనైనా బంగారు ఆభరణాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిర్సాలోని కలనవాలి ఏరియాలో ఓ మహిళ తన వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ గిన్నెలో వేసింది. అయితే కూరగాయలు కత్తిరించగా వచ్చిన చెత్తను బంగారు ఆభరణాలు ఉన్న గిన్నెలో పొరపాటున వేసింది. 
 
ఆ గిన్నెలోనే బంగారు ఆభరణాలు ఉన్నాయన్న విషయం మరిచిన మహిళ... తన ఇంటికి సమీపంలో ఉన్న చెత్తకుండీ వద్ద పడేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ ఎద్దు ఆ కూరగాయల చెత్తతో పాటు బంగారు ఆభరణాలను కూడా మింగేసింది. 
 
ఆ తర్వాత ఇంట్లో పెట్టిన బంగారం కనిపించకపోవడంతో ఇంటి వద్ద సీసీ కెమెరాలను పరిశీలించింది. ఆమె పడేసిన చెత్తను ఎద్దు తిన్నట్లు సీసీ కెమెరాల్లో తేలింది. దీంతో బాధితురాలు వెటర్నరీ డాక్టర్లకు సమాచారం అందించి.. ఆ ఎద్దును పట్టుకున్నారు. 
 
ఇప్పుడు తన ఇంటి వద్దే ఎద్దును కట్టేసి దాన పెడుతున్నారు. మింగేసిన బంగారం.. పేడలోనైనా వస్తుందేమోనని ఆమె ఆశలు పెట్టుకుంది. ఒక వేళ పేడలో కూడా బంగారం రాకపోతే.. ఈ ఎద్దును గోశాలకు తరలిస్తామని బాధితురాలు చెప్పింది.